ఫాంహౌస్‌లోనే చండీయాగం
జగదేవ్‌పూర్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చేపట్టనున్న మహ చండీయాగం నిర్వహణ పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో వచ్చే నెల 23 నుంచి 27 వరకు చండీయాగం నిర్వహించనున్నారు. యాగం కోసం పలు ప్రాంతాలు పర్యవేక్షించిన చివరకు కేసీఆర్ ఫాంహౌస్నే ఫైనల్ చేశారు. యాగస్థలి కోసం వ్యవసాయ క్షేత్రంలోని భూమిని చదును చేస్తున్నారు. ఇందులో కొంత భాగం అల్లం పంట ఉండటంతో, వాటిని తీసే పనులను వేగవంతం చేశారు. ఇక డాగ్ స్క్వాడ్‌లతో ప్రత్యేక బలగాలు ఈ పనుల్ని పర్యవేక్షిస్తున్నాయి.
చండీయాగానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా కేసీఆర్ ఆహ్వానించారు. 3 వేల మంది పండితులతో ఈ క్రతువును కేసీఆర్ నిర్వహిస్తున్నారు. సుమారు 10 వేల మంది ఈ మహా చండీయాగాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 26 లేదా 27 తేదీలలో కేసీఆర్ స్వయంగా చండీయాగం పనులు పరిశీలించనున్నారు.
కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆయూత మహా చండీయాగం నిర్వహిస్తామని కేసీఆర్ మొక్కుకున్న విషయం తెలిసిందే. గతంలోనూ ఆయన చండీయాగం చేశారు. 2006లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ సహస్ర చండీయాగం చేశారు.