
గిరిజన ఎమ్మెల్యే అంటే చులకనా?
కురుపాం : గిరిజన ఎమ్మెల్యే అంటే అంత చులకనా..? అధికారుల తీరు మారకుంటే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అధికారులను హెచ్చరించారు. శనివారం కురుపాం ఎంపీపీ ఆనిమి ఇందిరాకుమారి అధక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జీఓ నంబర్ 520 ప్రకారం నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలను స్థానిక ఎమ్మెల్యేకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఇందుకు విరుద్ధంగా ఇక్కడ ఇతర ప్రాంతాల నాయకులను తీసుకొచ్చి ప్రారంభోత్సవాలు చేస్తున్నారని విమర్శించారు. ఇది మంచి పద్ధతి కాదని మండల స్థాయి అధికారులకు హితవు పలికారు. ఇదే పరిస్థితి భవిష్యత్‌లో కొనసాగితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయక తప్పదని హెచ్చరించారు.