కుస్తీమే సవాల్ | kusthi competition in jaheerabad village | Sakshi
Sakshi News home page

కుస్తీమే సవాల్

Published Sun, Mar 27 2016 4:16 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

కుస్తీమే సవాల్ - Sakshi

కుస్తీమే సవాల్

వారు భీకరంగా తలపడతారు కానీ యుద్ధంలో కాదు.. జబ్బలు చరుస్తారు, తొడలు కొడతారు కానీ కయ్యానికి కాలు దువ్వడానికి కాదు.. ఒకరికొకరు తలపడుతూ మట్టికరిపించేందుకు విశ్వప్రయత్నం చేస్తారు కానీ పోట్లాటకు కాదు.. ఇవన్నీ కుస్తీపట్టులో భాగమే. అక్కడి యువకులకు కుస్తీపట్లు వెన్నతో పెట్టిన విద్య..  ప్రత్యర్థి ఎలాంటివాడైనా ఓ ‘పట్టు’పట్టి వదిలిపెడతారు.. కుస్తీపై ఆ గ్రామస్తులకున్న అమితాసక్తే ఏకంగా పోటీలు నిర్వహించే స్థాయి వరకు తీసుకెళ్లింది.. గ్రామానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది.. ప్రస్తుతం ఆ పల్లె కండలవీరులకు నిలయంగా మారింది. ఈ గుర్తింపు వెనుక వారు చేస్తున్న కసరత్తు ఎంతో ఉంది. ‘కుస్తీమే సవాల్’ అంటున్న ఆ క్రీడాకారులపై ఈ ఆదివారం ప్రత్యేకం..  -బషీరాబాద్

ఒకరిని చూసి ఒక రు ఆ గ్రామంలో కుస్తీపై ఇష్టం పెంచుకున్నారు. త మ ప్రతిభతో గ్రామానికి, జిల్లాకు మంచి గుర్తింపు తెచ్చారు. బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామస్తులకు కుస్తీఅంటే ఎంతో మక్కువ. ఏటా శివరాత్రి వచ్చిందంటే వారికి నిజంగా పెద్ద పండుగే. కుస్తీపోటీలతో గ్రామంలో ఉండే సందడి అంతా ఇంతాకాదు.

 అలా ఆసక్తి పెంచుకుని..
జీవన్గి గ్రామం కర్ణాటక సరిహద్దులో ఉండడంతో 60 శాతం అక్కడి సంప్రదాయాలనే పాటిస్తుంటారు. బంధువులు ఎక్కువగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారు కావడంతో తరచూ రాకపోకలు సాగిస్తుంటారు. కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాలోని బసవకల్యాణ్ ప్రాంతంలో ఉన్న హర్కూడ్ చెన్న బసవేశ్వర దేవాలయ ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. ఉత్సవాలకు వీక్షించేందుకు జీవన్గి గ్రామస్తులు సైతం వెళ్తుంటారు. ఉత్సవాల సందర్భంగా ఇక్కడ కుస్తీ పోటీలు నిర్వహిస్తుంటారు. అలా ఆ పోటీలను చూసిన గ్రామస్తులకు కుస్తీపై ఆసక్తి ఏర్పడింది. అక్కడి పోటీల్లో గ్రామానికి చెందిన యువకులు తలపడుతూ వచ్చారు. 

 పోటీలకు కర్ణాటక నుంచి..
గతంలో జీవన్గి గ్రామం నుంచి పోటీలకు కర్ణాటకు వెళ్లేవారు. ప్రస్తుతం కర్ణాటక నుంచే ఇక్కడ జరిగే పోటీలకు పెద్ద ఎత్తున వస్తున్నారు. క్రీడాకారులతోపాటు పోటీలను వీక్షించేందుకు అక్కడి నుంచి భారీగా తరలివస్తుంటారు. ఆరేళ్లుగా చించోళితాలుకా కరకుముకులి గ్రామానికి చెందిన అర్జున్ కుస్తీ పోటీల్లో గెలిచి సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం జీవన్గి గ్రామస్తులను చూసి చుట్టుపక్కల గ్రామాల యువకులు సైతం కుస్తీపట్ల ఆసక్తి చూపుతున్నారు. 

ఇలా అంకురార్పణ..
జీవన్గి గ్రామంలో కాగ్నా నది మధ్యలో వెలసిన మహదేవ లింగేశ్వర ఆలయానికి జాతరను సైతం ఘనంగా నిర్వహిస్తుంటారు. హర్కూడ్‌లో జరిగే పోటీలను చూసిన గ్రామస్తులకు తమ ఊళ్లోనూ పోటీలను నిర్వహించాలన్న ఆలోచన తట్టింది. అనుకున్నదే తడవుగా విషయాన్ని పెద్దలకు చెప్పారు. వారంతా వెంటనే ఇందుకు అంగీకరించారు. 1986లో పోటీలు నిర్వహించాలని నిర్ణయించినా అందుకు పరిస్థితులు అనుకూలించలేదు. రెండేళ్లు అలా వాయిదా పడుతూ వచ్చింది. 1988లో ముహూర్తం కుదిరింది. అలయ కమిటీ సభ్యులు పోటీలను ప్రారంభించారు. మొదటిసారి పదిమంది కుస్తీవీరులు పోటీల్లో తలపడ్డారు. ఏటా ఈ సంఖ్య పెరుగుతూ ప్రస్తుతానికి 150 నుంచి 200 మంది వరకు పాలుపంచుకుంటున్నారు. 29 ఏళ్లుగా పోటీలను నిర్విగ్నంగా సాగిస్తూ వస్తున్నారు. పోటీల్లో గెలుపొందిన వీరుడిని ఘనంగా సన్మానించడంతోపాటు నగదు బహుమతిగానీ, వెండి కడియాన్ని గానీ అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు.

కఠోరసాధన.. ఆహార నియమాలు..
కాగ్నానది ఒడ్డున ఉన్న ఇసుక దిబ్బల్లో గ్రామానికి చెందిన కుస్తీవీరులు నిత్యం కఠోర సాధన చేస్తుంటారు. కొత్తగా కుస్తీపట్లు నేర్చుకునేవారు సైతం ఇక్కడే మొదలుపెడతారు. నానబెట్టి మొలకెత్తిన శనగలు, జొన్నసంకటి, జొన్నరొట్టెలు, రాగిసంకటి, బెల్లం, పాలు, పండ్లు,గుడ్లు, మాంసం ఆహారంగా తీసుకుంటారు. పోటీలకు నెల రోజుల ముందుగా సాధన ముమ్మరం చేస్తారు.

 నిబంధనలివే..
సమఉజ్జీ ఉంటేనే పోటీలో పాల్గొనాలి.
పోటీల్లో మూడు సార్లు ఓడిపోతే తిరిగి పోటీ చేసేందుకు వీలుండదు.
పోటీల్లో ఐదుసార్లు గెలుపొందిన వ్యక్తికి ఆఖరిపోరులో అవకాశం ఉంటుంది
నిబంధనలు పాటించని వారిని పోటీల నుంచి తప్పిస్తారు.
ప్త్యర్థిని వెల్లకిలా ఇసుకతాకేలా పడేస్తే గెలుపొందినట్టు.

 చిన్నప్పటి నుంచి చూస్తున్నాను..
మా తాతలు 30 ఏళ్ల క్రితం కుస్తీపోటీలను ప్రారంభించారు. చిన్నప్పటి నుంచి పోటీలను చూస్తూ పెరి గాను. ప్రస్తుతం ఆలయ ఉత్సవాల్లో పాలుపంచుకుంటున్నాను. కుస్తీ పోటీలతో గ్రామానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది.  - పట్లోళ్ల వీరారెడ్డి, పీఏసీఎస్ డెరైక్టర్

పోటీల్లో ఐదుసార్లు గెలిచాను..
కుస్తీపోటీల్లో 15 ఏళ్లుగా తలపడుతూ వస్తున్నాను. ఇప్పటికి ఐదుసార్లు విజేతగా నిలిచాను. బహుమతి సంగతి అటుంచితే గెలుపుతో నాకు మంచి పేరు వచ్చింది. ఆనందంగా ఉంది. మూడేళ్లుగా పోటీల్లో పాల్గొనడం లేదు.  - సోంశెట్టి వీరేశం, జీవన్గి 

సంతోషంగా ఉంది..
30 ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన తోట రాములు, కుర్వ రాములు కుస్తీ పోటీల్లో పాల్గొనేందుకు కర్ణాటక వెళ్లేవారు. మన గ్రామంలో కూడా పోటీలను ప్రారంభిస్తే బాగుంటుందని చెప్పడంతో మొదలుపెట్టాం. మొదట్లో పదిమంది పాల్గొన్నారు. ప్రస్తుతం 200 వరకు సంఖ్య పెరగడం సంతోషంగా ఉంది.   - వడ్ల లాలప్ప, గ్రామస్తుడు

 గర్వంగా ఉంది..
కుస్తీ పోటీలను చూసేందుకు కర్ణాటక వెళ్లేవాళ్లం. కుస్తీవీరులు కర్ణాటకలో ఎక్కువగా ఉండేవారు. ప్రస్తుతం జీవన్గిలో సైతం కుస్తీవీరులు తయారవుతుండడం, గ్రామానికి పేరు తేవడం గర్వంగా ఉంది.  - ఊరడి అనంతప్ప, గ్రామస్తుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement