జిల్లాలో బెట్టింగ్‌రాయుళ్లు ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నారు.
►నంద్యాల ఉపఎన్నికపై జోరుగా పందేలు
►జిల్లాలో రూ.కోట్లలో జరుగుతున్న వైనం
►వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు అంచనాలతో వెనక్కి తగ్గుతున్న టీడీపీ
►ఎక్కడ చూసినా నంద్యాల గురించే చర్చ
కడప : జిల్లాలో బెట్టింగ్‌రాయుళ్లు ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నారు. ఒకసారి ఐపీఎల్, మరోసారి ఇండియా మ్యాచ్‌లపై బెట్టింగ్ జరుగుతుండగా.. ప్రస్తుతం నంద్యాల ఉప ఎన్నికపైనే జోరుగా బెట్టింగ్‌లు వేయిస్తున్నారు. ఊహకందని రీతిలో రాష్ట్రవ్యాప్తంగా బెట్టింగ్‌లు జరుగుతుండగా.. జిల్లాలో కూడా పెద్దఎత్తున పోటీ పడుతున్నారు. నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి 40రోజులుగా ప్రచార పర్వం జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా బెట్టింగ్‌రాయుళ్లు అప్పటినుంచే భారీగా పందేలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో నంద్యాల పోలింగ్ నేపథ్యంలో ఎక్కడ చూసినా ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బెట్టింగ్‌కు అన్ని పార్టీల వారు కాలర్ ఎగరేస్తున్నారు.
కోట్లలో బెట్టింగ్
జిల్లాలో నంద్యాల ఉపఎన్నికపై భారీగా బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. ఎన్నికకు ముందు ఒక రేటు.. పోలింగ్ సరళిని బట్టి అయితే మరొక రేటు అన్నట్లు బెట్టింగ్ జరుగుతోంది. ఎక్కడచూసినా చిన్న, పెద్దా, ఉద్యోగ, కార్మిక ఇలా పార్టీల నాయకులతోపాటు ప్రతి ఒక్కరిలోనూ నంద్యాల ఉప ఎన్నిక గురించే చర్చ జరుగుతోంది. కిందిస్థాయి కార్యకర్తల నుంచి ఓ రకమైన నేతల వరకు నంద్యాల ఉపఎన్నికపై ఆరా తీసి పందేలు పెట్టేందుకు ఆసక్తిచూపుతున్నారు. ఏదీ ఏమైనా జిల్లాలో పెద్ద ఎత్తున బెట్టింగ్ వ్యవహారం కొనసాగుతోంది. ఎన్నికలకు సంబంధించి ఫలితాలు ఈనెల 28వ తేదీన వెలువడనున్నాయి.
వెనుకంజ వేస్తున్న టీడీపీ
కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ ముందురోజు వరకు టీడీపీ గెలుపు తమదేనంటూ కాలర్ ఎగరేసినా బుధవారం మాత్రం చతికిలపడ్డారు. పోలింగ్ సరళి బట్టి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి గెలుపు తథ్యమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో టీడీపీ నేతలు వెనుకంజ వేస్తున్నారు. ఎన్నిక ముందురోజు వరకు లక్షకు రూ.1.50లక్షలు ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చిన టీడీపీ నేతలు ప్రస్తుతం లక్షకు లక్ష ఇచ్చేందుకు కూడా సిద్ధంగా లేకపోగా పందేలు కాయడానికి కూడా వెనుకంజ వేస్తున్నారు. ఎన్నికలలో శిల్పా మోహన్‌రెడ్డి గెలుపు దాదాపు ఖాయమైందని, ఈ నేపథ్యంలో అనవసరంగా పందేలు పెట్టి నష్టపోవడంకంటే ఊరకుండటమే మంచిదనే నిర్ణయానికి టీడీపీ నేతలు వచ్చినట్లు తెలుస్తోంది.