ఆశల దీపం ఆరిపోయింది!
నీటి తొట్టిలో పడి ఒక్కగానొక్క కుమారుడి మృతి
కౌతాళం: ముగ్గురు కుమార్తెల తర్వాత జన్మించిన కుమారుడిని అల్లారు ముద్దుగా చూసుకున్నారు. ఇంటి వారసుడు పుట్టాడని కుటుంబమంతా సంతోషపడింది. ఇంతలోనే వారి ఆనందాన్ని విధి కాటేసింది. నీటి తొట్టి రూపంలో రెండేళ్ల చిన్నారిని మృత్యువు పొట్టున పెట్టుకుంది. ఈ విషాద ఘటన కౌతాళంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానిక ఎన్‌టీఆర్ నగర్‌లో నివసిస్తున్న కృష్ణ, లక్ష్మమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక్కగానొక్క కుమారుడు ఆంజనేయులు (2) సంతానం. శుక్రవారం లక్ష్మమ్మ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో భర్త ఆదోనికి తీసుకెళ్లాడు. బాలుడిని నానమ్మ వద్ద వదిలి వెళ్లారు. రోజు మాదిరిగానే ఇంటి ముందు ఆడుకుంటుండగా నానమ్మ ఇంటి పనిలో నిమగ్నమైంది. ప్రమాదవశాత్తు రహదారి పక్కనే ఉన్న వీధి నీటి తొట్టిలో బాలుడు పడిపోయాడు. ఎవరూ గమనించకపోవడంతో ఊపిరాడక మృతి చెందాడు. కొద్ది సేపటికి చిన్నారి కనిపించకపోవడంతో అనుమానంతో నీటి తొట్టిలో చూడగా విగత జీవిగా కనిపించాడు. ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.