అమిత్ షా, వెంకయ్యలతో లక్ష్మణ్ భేటీ
పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చ
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆదివారం ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడుని కలిశారు. వీరిద్దరితో వేర్వేరుగా భేటీ అయిన లక్ష్మణ్ పార్టీ సంస్థాగత విషయాలపై చర్చించారు. అమిత్ షాతో జరిగిన సమావేశంలో లక్ష్మణ్‌తో పాటు కేంద్ర కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ, పార్టీ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, ఎమ్మెల్సీ రామచందర్‌రావు కూడా పాల్గొన్నారు. అనంతరం లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీని ప్రత్యామ్నాయ శక్తిగా రూపొందించేందుకు కృషి చేస్తామన్నారు.
కేంద్ర పెద్దల ఆశీర్వా దం, మద్దతు కోసం వచ్చానని, పూర్తి సహకారం అందిస్తామని అమిత్ షా చెప్పారని ఆయన తెలిపారు. కేంద్ర పెద్దల అంచనాలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. ఈ నెల 22న హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో నిర్వహించనున్న బహిరంగసభలో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతానని, గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తామని లక్ష్మణ్ చెప్పారు. రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులపై ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతకు ముందు వెంకయ్య నాయుడుతో లక్ష్మణ్ సమావేశమయ్యారు. లక్ష్మణ్ కింది స్థాయినుంచి ఎదిగిన వ్యక్తని, అందరినీ కలుపుకొని వెళతారని వెంకయ్య ఈ సందర్భంగా చెప్పారు. తెలంగాణాలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని వెంకయ్య నాయుడు సూచించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని, జిల్లా, మండల స్థాయిలో బలమైన నాయకత్వాన్ని తయారుచేయాలన్నారు. ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లుపై కసరత్తు జరుగుతోందని, తగిన సమయంలో బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకెళ్తామని వెంకయ్య నాయుడు చెప్పారు.