ప్రభుత్వాల దిమ్మ తిరగాలి
ప్రభుత్వాల దిమ్మ తిరగాలి
Published Sat, Jul 30 2016 12:02 AM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
(విజయవాడ) గాంధీనగర్ :
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిమ్మ తిరిగేలా దేశవ్యాప్త సమ్మె చేపట్టాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. 12 డిమాండ్ల సాధన కోసం సెప్టెంబర్ 2న చేపడుతున్న దేశవ్యాప్త సమ్మెను బలపరుస్తూ కార్మిక సంఘాల జిల్లా సదస్సు తీర్మానం చేసింది. శుక్రవారం విజయవాడ స్థానిక హనుమంతరాయ గ్రంథాలయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 2న జరపతలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ కార్మిక సంఘాల సన్నాహక సదస్సు జరిగింది. సదస్సులో పాల్గొన్న పలువురు వక్తలు మాట్లాడుతూ కార్మికుల హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయన్నాయని, కనీస వేతనం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. సదస్సులో పాల్గొన్న వైఎస్సార్ ట్రేడ్‌యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి మాట్లాడుతూ కార్మికుల శ్రేయస్సును దెబ్బతీసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ధ్వజమెత్తారు. కార్మికులు సమ్మె చేస్తే వారికి రూ. 6లక్షల వరకు జరిమానా విధించేలా చట్టాలను సవరించడం దుర్మార్గమన్నారు.
కార్మికులకు కనీస వేతనం రూ. 18వేలు కావాలని డిమాండ్ చేస్తే పట్టించుకునే నాథుడే లేడన్నారు. ఎన్నికల తర్వాత బీజేపీ, టీడీపీ ప్రభుత్వాల నిజస్వరూపం బట్టబయలైందన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న చంద్రబాబు రెండేళ్లుగా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. పైగా నిరుద్యోగులు వ్యవసాయం చేసుకుందామనుకుంటే భూములు లేకుండా గుంజుకుంటున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15లక్షల ఎకరాల భూమిని లాక్కø్కవడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు. కార్మికులు, నిరుద్యోగులు చంద్రబాబు ప్రభుత్వం మెడలు వంచి హక్కులు సాధించుకోవాలన్నారు.
కార్మికుల సెస్సుతో సొంత ప్రచారమా..?
ఎఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు చలసాని రామారావు మాట్లాడుతూ భవననిర్మాణ కార్మికుల సంక్షేమానికి వసూలు చేస్తున్న సెస్సును చంద్రన్నబీమా పేరుతో సొంత ప్రచారానికి విచ్చలవిడిగా వాడుకుంటున్నారని మండిపడ్డారు.
ఆగస్టు 9న జిల్లా కలెక్టరేట్ల ముట్టడిని విజయవంతం చేయాలని కోరారు. ఈ సదస్సులో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు, కె రామారావు (ఇఫ్టూ), మాదు శివరామకృష్ణ (వైఎస్సార్‌టీయూ) గర్రె వరప్రసాద్ (ఐఎన్‌టీయూసీ), పి ప్రసాద్ (ఇప్టూ), మీర్‌హుస్సేన్ (హెఎంఎస్), వెంకటసుబ్బయ్య, నరసింహారావు, ఎన్‌సీహెచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
Advertisement