పాల సేకరణలో పరిమితులు
‘ప్రైవేట్’కు సహకరిస్తున్న విజయ డెయిరీ
♦ సీఎం లీటర్‌కు రూ.4 ప్రోత్సాహకం ప్రకటించినా పట్టించుకోని అధికారులు
♦ పెద్ద రైతులు ప్రోత్సాహకం జాబితాలోకి రారంటూ అడ్డుపుల్ల
♦ పరిమితులు పెడితే నష్టపోతామంటున్న పాడి రైతులు
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: పాడి రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం లీటర్ పాలకు రూ.4 చొప్పున ప్రోత్సాహకాన్ని ప్రకటించినా దానిని అమలు చేయడంలో విజయా డెయిరీ పూర్తిగా విఫలమైంది. పొరుగు రాష్ట్రాల నుంచి పాలు సేకరిస్తున్న వారికి ప్రోత్సాహకం పేరుతో అధికమొత్తంలో చెల్లింపులు చేసిన విజయ డెయిరీ ఆ అక్రమం కాస్త బయటపడటంతో రాష్ట్రంలో రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేసే చర్యలకు శ్రీకారం చుట్టింది. పొరుగు రాష్ట్రాల నుంచి పాలు సేకరిస్తున్న వారికి చెల్లింపులు ఆపేయాల్సింది పోయి రాష్ట్రంలో పాడి రైతులకు సేకరణలో పరిమితులు విధించే దుర్మార్గ చర్యలకు పూనుకుంటోంది.
పెద్ద రైతులు ప్రోత్సాహకం పరిధిలోకి రారని సర్క్యులర్ ఇచ్చింది. రాష్ట్రంలో సంక్షోభంలో ఉన్న పాడి రైతాంగాన్ని ఆదుకోవాలన్న ముఖ్యమంత్రి నిర్ణయాన్ని అపహాస్యం పాలు చేసే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాన్ని దృష్టిలో ఉంచుకుని వందలాది మంది రైతులు కోట్లాది రూపాయలు వెచ్చించి ఆవులు, గేదెలు కొనుగోలు చేశారు. ఒక రైతుకు నాలుగు ఆవులు ఉంటే రోజుకు 50 లీటర్ల పాల దిగుబడి ఉంటుంది. గడచిన రెండేళ్లుగా కరువు పరిస్థితులు ఉండటంతో రైతులు పాడి రంగాన్ని ఎంచుకుని బ్యాంక్‌ల నుంచి అప్పులు తెచ్చి మరీ పెట్టుబడి పెట్టారు. అయితే ఆ రైతులను ప్రోత్సహించాల్సిన విజయ డెయిరీ పాల సేకరణ చేయకుండా పరోక్షంగా ప్రైవేట్ డెయిరీలకు సహకరిస్తోంది. విజయా సంస్థ పాల సేకరణలో చూపుతున్న అలసత్వం కారణంగా రైతులు విధి లేక తమ పాలను ప్రైవేట్ డెయిరీలకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది.
సేకరణ కేవలం 5 లక్షల లీటర్లు
తెలంగాణలో రైతాంగానికి ప్రత్యామ్నాయ ఉపాధిగా పాడి రంగం ఉపకరిస్తోంది. అయితే, వర్షాలు లేకపోవడం, పశుగ్రాసం లభించకపోవడం, ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం లీటర్‌కు రూ.4 చొప్పున ప్రోత్సాహక ధరను ప్రకటించింది. దీంతో రైతులు విజయా డెయిరీ పాలను సేకరిస్తుందన్న ఉద్దేశంతో ఉత్పత్తిని పెంచారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 25 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుండగా విజయా డెయిరీ అతి కష్టం మీద ఐదు లక్షల లీటర్ల పాలను సేకరిస్తోంది. రాష్ట్రంలో పాల ఉత్పత్తిని దృష్టిలో ఉంచుకుని పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య మౌలిక సదుపాయాలు పెంచుకునే ప్రయత్నమే చేయడం లేదు.
మౌలిక సదుపాయాలు పెంచితే హైదరాబాద్‌లో జనాభాకు అవసరమైన పాలను సరఫరా చేసేందుకు ఈ సమాఖ్యకు వీలు కలుగుతుంది. అయితే, ప్రైవేట్ డెయిరీలతో కుమ్మక్కై రైతులకు ప్రోత్సాహకం అందకుండా కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నారు. రాజధానిలో పాలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ రంగంలో పెట్టుబడులు పెట్టిన రైతాంగానికి ప్రోత్సహకాన్ని నిలిపివేయడంపై రైతుల్లో నిరసన వ్యక్తమవుతోంది. వరంగల్ ఎన్నికల ప్రచారంలో ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి వారు తమ సమస్యలను విన్నవించారు.
లక్ష్యం ప్రైవేట్‌కు ప్రోత్సాహకమేనా!
మౌలిక సదుపాయాలు లేవన్న సాకుతో వేలాది మంది రైతుల నుంచి పాలను సేకరించడానికి విజయా డెయిరీ వెనకాడటానికి పరోక్షంగా ప్రైవేట్‌కు సహకరించడమేనన్న ఆరోపణలు లెక్కకు మించి ఉన్నాయి. మెదక్ జిల్లా గజ్వేల్‌లో మిల్క్ గ్రిడ్, హైదరాబాద్ సమీపంలో మెగా ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం పదేపదే చెపుతున్నా ఈ పాడి సమాఖ్య మాత్రం ముందుకు రావడం లేదు. వాటిని ఏర్పాటు చేస్తే ప్రైవేట్ నుంచి తమకు వచ్చే ‘సహకారం’ ఆగిపోతుందేమోనన్న ఆందోళన అధికారుల్లో కనిపిస్తోంది. ఓ వైపు రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో పాడి రైతులను ఆదుకోవాల్సింది పోయి ఇప్పుడు మరో సంక్షోభాన్ని సృష్టించే ప్రయత్నంలో విజయ డెయిరీ ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. అమూల్ సంస్థ దే శ వ్యాప్తంగా వ్యాపారాన్ని విస్తరించుకుంటూనే గుజరాత్‌లోని 34 లక్షల మంది పాడి రైతులను ఆదుకుంటున్న విషయాన్ని విజయా డెయిరీ విస్మరిస్తోంది.
ఆత్మహత్యలకు ఆజ్యం పోసే చర్య
రైతుల నుంచి పాలు సేకరించడంలో విజయ డెయిరీ అలసత్వం చూపుతోంది. ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాన్ని నిలిపివేయడం ద్వారా రైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులను సృష్టిస్తోంది. ఇప్నటికే ఖర్చులు పెరిగిపోయి పాడి రైతులు తీవ్రమైన నష్టాలను చవిచూస్తున్నారు. ఈ చర్యతో మరిన్ని కష్టాలపాలవుతారు. ప్రభుత్వం ఈ చర్యను నిలుపుదల చేసేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి.
-పాడిరైతుల సంఘం ప్రధాన కార్యదర్శి బాల్‌రెడ్డి