లోకేష్ ఫ్లెక్సీ ఘటనలో గాయపడిన యువకుడి మృతి
లోకేష్ ఫ్లెక్సీ ఘటనలో గాయపడిన యువకుడి మృతి
Published Wed, Apr 26 2017 11:53 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM
జీజీహెచ్ వద్ద నష్టపరిహారం కోసం ఆందోళన
హోంమంత్రి రాజప్ప హామీతో శాంతించిన బంధువులు
కాకినాడ క్రైం (కాకినాడ సిటీ) : రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జిల్లా పర్యటన కోసం ఫ్లెక్సీ కడుతుండగా షార్ట్ సర్క్యూట్‌తో షాక్‌కు గురైన వ్యక్తి మంగళవారం రాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మృతుడి బంధువులు చేపట్టిన ఆందోళన.. టీడీపీ వర్గాలను పరుగులు పెట్టించింది. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట ఏపీఐఐసీ కాలనీకి చెందిన దున్న అనిల్‌కుమార్ (25) ఈ నెల 17న వాకలపూడిలో స్వాగత ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్ తీగలు తగిలి తీవ్ర కాలిన గాయాలతో కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చేరిన విషయం విదితమే. అతడిని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పరామర్శించి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ కూడా ఇచ్చారు. మెరుగైన వైద్యం కోసం అతడిని అపోలో ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతునికి భార్య రామలక్ష్మి, ఏడాదిన్నర వయసు ఉన్న బాబు ఉన్నాడు.
జీజీహెచ్ వద్ద బంధువుల ఆందోళన
మృతి చెందిన అనిల్‌కుమార్ కుటుంబాన్ని ఆదుకోవాలని భవన నిర్మాణ కార్మికుల సంఘం, సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం కాకినాడ జీజీహెచ్ పోస్ట్‌మార్టమ్ వద్ద బంధువులకు ఆందోళనకు దిగారు. మృతుని భార్య రామలక్ష్మికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, రూ.10 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం, హోంమంత్రి నుంచి స్పష్టమైన హామీ ఇచ్చేదాకా మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ నిర్వహించడానికి వీల్లేదని బంధువులు భీష్మించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అమరావతిలో ఉన్న హోంమంత్రి రాజప్పకు స్థానిక నేతలు ఇక్కడ పరిస్థితిని వివరించారు. దీంతో ఆయన తరఫున తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు కటంశెట్టి ప్రభాకర్ (బాబి)ని బంధువులతో చర్చించేందుకు పంపించారు. హోంమంత్రి నుంచి స్పష్టమైన హామీ కావాలని ఆయనకు బంధువులు స్పష్టంచేశారు. దీంతో సెల్‌ఫోన్ ద్వారా ఆందోళనకారులు, కుటుంబ సభ్యులతో హోంమంత్రి మాట్లాడారు. మృతుని కుటుంబానికి చంద్రన్న బీమా పథకం ద్వారా రూ.5 లక్షలు, ఎక్స్‌గ్రేషియా కింద రూ.5 లక్షలు ప్రభుత్వం అందజేస్తుందని హామీ ఇచ్చారు. మృతుని భార్య రామలక్ష్మికి ఉద్యోగం ఇచ్చేందుకు కృషి చేస్తానని తమకు హామీ ఇచ్చినట్లు సీపీఐ నగర కార్యదర్శి తోకల ప్రసాద్ తెలిపారు. హోంమంత్రి హామీ మేరకు అనిల్‌కుమార్ మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ నిర్వహించేందుకు అంగీకరించారు.
Advertisement
Advertisement