లోకేష్... ‘వైట్ ఎలిఫెంట్’: టీడీపీ ఎమ్మెల్యే
నోరు జారిన పిఠాపురం ఎమ్మెల్యే వర్మ
కాకినాడ : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్‌పై టీడీపీ ఎమ్మెల్యే వర్మ చేసిన కామెంట్స్ వివాదస్పదంగా మారాయి. నారా లోకేశ్‌ని పిఠాపురం ఎమ్మెల్యే వర్మ ‘వైట్ ఎలిఫెంట్’తో పోల్చారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైనా, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిపైనా దూకుడుగా మాట్లాడిన వర్మ.... అదే ఊపులో తమ యువ నాయకుడు నారా లోకేష్ ఒక్కోమెట్టు ఎక్కుతూ ఎదుగుతున్నారని, ఆయనపై అనవసరంగా బురదజల్లుతున్నారంటూ ఆరోపించారు. ‘ఒక ఏనుగు మీద... తెల్ల ఏనుగు మీద’ బురద జల్లేందుకు ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఏనుగు తనపని తాను చేసుకుపోతుందని లోకేష్‌నుద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలతో మీడియా ప్రతినిధులు, పార్టీ నేతలు నివ్వెరపోయారు.
ఎమ్మెల్యే వర్మ కామెంట్స్‌పై టీడీపీ నేతలే విస్తుపోయారు. వైఎస్సార్ సీపీని విమర్శించడమే లక్ష్యంగా ప్రెస్‌మీట్ పెట్టి పనిలో పనిగా తమ యువనేతపై నోరుజారిన సదరు ఎమ్మెల్యే తీరు పార్టీ నేతల్లో చర్చనీయాంశమైంది. లోకేష్‌కు, రాజప్పకు జగన్ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే వర్మ డిమాండ్ చేశారు. పార్టీ సమావేశంలో జరిగిన సంభాషణకు వక్రభాష్యం చెప్పారంటూ ఆయన ఆరోపించారు.