
తిరుమల శ్రీవారి ఆలయంలో తులభారం సమర్పిస్తున్న పీవీ సింధూ, పక్కన గోపీచంద్, భానుప్రకాష్ రెడ్డి
– 68 కిలోల బెల్లంతో మొక్కులు సమర్పణ
– శ్రీవారికి తలనీలాలు సమర్పించిన గోపిచంద్
సాక్షి,తిరుమల: రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ పోటీల్లో రజత పతకం విజేత పీవీ సింధూ ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని, 68 కిలోల బెల్లంతో తులాభారం సమర్పించి మొక్కులు సమర్పించారు. కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా తలనీలాల మొక్కులు సమర్పించారు. ఉదయం వేళ తల్లిదండ్రులు విజయ, రమణ, సోదరి దివ్యతో సింధూ రాగా, సతీమణితో కలసి పుల్లెల గోపీచంద్ ఆలయానికి వచ్చారు. ముందుగా బెల్లంతో తులాభారం సమర్పించారు. తర్వాత శ్రీవారి, వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా, జేఈవో పోల భాస్కర్ లడ్డూ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర క్రీడలు, యువజన శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎస్‌వీ సుబ్రహ్మణ్యం, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్‌రెడ్డి, పసుపులేటి హరిప్రసాద్ వారి వెంట ఉన్నారు.
బాధ్యత పెరిగింది.. మరింత కష్టపడతా: పీవీ సిం«ధూ
రియో ఒలింపిక్స్‌లో వెండిపతకం సాధించడంతో తనపై బాధ్యత పెరిగిందని, మరింత కష్టపడి దేశానికి మంచిపేరు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని పీవీ సింధూ అన్నారు. ఒలింపిక్స్ ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నానని , పతకం సాధించి మళ్లీ వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడం ఆనందంగా ఉందన్నారు. భారతదేశంలో అమ్మాయిలకు ప్రోత్సాహం అందిస్తే మరికొందరి ప్రతిభ తప్పక వెలుగు చూస్తుందని ఓ ప్రశ్నకు బదులిచ్చారు.
దేవుడి కృప ఉండాలని ప్రార్థించాను : పుల్లెల గోపీచంద్
తిరుమల శ్రీవారి ఆశీస్సులు, సింధూ ఆటతీరుతో ఒలింపిక్స్‌లో పతకం వచ్చిందని, ఎల్లప్పుడూ ఆ దేవదేవుని కృప ఉండాలని కోరుకున్నానని కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. తలనీలాలు సమర్పించి శ్రీవారిని దర్శించుకోవటం ఆనందంగా ఉందన్నారు.