ఆత్మహత్యకు పాల్పడిన మౌనిక, సందీప్ (ఫైల్)
24 గంటల్లోపే రైలు కిందపడి యువతి, యువకుడి ఆత్మహత్య
♦ పెద్దలను ఎదిరించలేక.. కలిసి జీవించలేక బలవన్మరణం
♦ కులాలు వేరు కావడమే ఆ జంటకు ప్రధాన అడ్డంకి
♦ ఆత్మహత్యకు ముందు స్నేహితుడికి సమాచారం
♦ అవయవాలు ఇతరులకు ఇవ్వాలని విజ్ఞప్తి
♦ వేటపాలెం రైల్వేస్టేషన్‌లో ఘటన..
చీరాల:
వారిద్దరూ ఇంజినీరింగ్ చదువుతున్నారు. కలిసి బతకాలన్న ఆ జంట ఆకాంక్షకు కులాలు అడ్డొచ్చాయి. పెద్దలను ఎదిరించలేక.. అంతకు మించి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేక ప్రేమికులు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి సరిగ్గా 24 గంటల ముందు ఓ గుడిలో వివాహం చేసుకుని దంపతులయ్యారు. ఆత్మహత్య అనంతరం పనికి వచ్చే తమ అవయవాలు దానం చేయాలని ఆ జంట తమ స్నేహితులకు విజ్ఞప్తి చేసింది. ఈ హృదయ విదారక సంఘటన మంగళవారం రాత్రి వేటపాలెం రైల్వేస్టేషన్‌లో జరిగింది. వివరాలు.. చీరాలలోని ఓ ప్రైవేటు ఇంజి నీరింగ్ కాలేజీలో నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన బత్తుల సందీప్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అదే కాలేజీలో గుంటూరు జిల్లా మోదుకూరుకు చెందిన మౌనిక రెండో సంవత్సరం చదువుతోంది. ఇద్దరి మధ్య పెరిగిన స్నేహం ప్రేమగా మారింది.
ఇద్దరూ అగ్రకులాల వారే. అయినా కులాలు వేరు కావడంతో ఇరువర్గాల పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. ప్రేమను వదులుకోకుంటే చనిపోతామని యువతి, యువకుడిని హెచ్చరించారు. కన్నవారిని ఎదిరించలేక ఇద్దరూ కుమిలిపోయారు. తమ కారణంగా తల్లిదండ్రులకు ఆపద రాకూడదని భావించారు. తాము ప్రాణాలు వదిలినా తల్లిదండ్రులు క్షేమంగా ఉండాలని భావించారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేమని తలచారు. ఆత్మహత్యకు ముందు ఒక్క క్షణమైనా దంపతులుగా జీవి ంచాలని భావించారు. విజయవాడ వెళ్లి అక్కడ ఓ దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. మంగళవారం రాత్రి వేటపాలెం రైల్వేస్టేషన్ చేరుకున్నారు.
స్నేహితుడికి ఫోన్ చేసి..
పెళ్లి విషయాన్ని సందీప్ తన స్నేహితుడికి ఫోన్‌లో సమాచారం ఇచ్చాడు. పెద్దలను ఎదిరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నామని, ఈ విషయాన్ని ఇరువర్గాల పెద్దలకు చెప్పాలని కోరాడు. తమ అవయవాలు ఇతరులకు బనికొస్తే ఇవ్వాలని కోరాడు. సంఘటన జరిగిన వెంటనే 108 సిబ్బందికి సమాచారం ఇవ్వాలనీ ప్రాథేయపడ్డాడు. ఈ సమాచారాన్ని 108కు అందించాలని సూచించాడు.
తలలు పట్టాలపై ఉంచి..
సందీప్, మౌనికలు తలలు మాత్రమే పట్టాలపై ఉంచి పడుకున్నారు. వేగంగా వచ్చిన రైలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. స్నేహితులు వెంటనే చీరాల జీఆర్పీ ఎస్‌ఐ జి.రామిరెడ్డికి చెప్పడంతో ఆయన తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నా రు. సందీప్ మొబైల్ ఆధారంగా వారి వివరాలు తెలుసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.
మిన్నంటిన రోదనలు
రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్న ప్రేమికుల మృతదేహాలు చీరాల ఏరియా వైద్యశాల మార్చురీకి తరలించారు. ఇద్దరి తల్లిదండ్రులు, బంధువులు బుధవారం ఉదయం ఏరియా వైద్యశాలకు చేరుకున్నారు. ఉన్నత చదువులు చదువుకొని తమ కలలను నిజం చేస్తారన్న వారు ప్రేమ కోసం ప్రాణాలు తీసుకున్నారంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబానికి ఆసరాగా నిలుస్తాడకుంటే తమ ఆశలను అడియాశలు చేశాడంటూ రోదించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను తల్లిదండ్రులు తమ తమ స్వగ్రామాలకు తీసుకెళ్లారు.