బడ్జెట్ విడుదల అరకొరే | low budget release for pending loans | Sakshi
Sakshi News home page

బడ్జెట్ విడుదల అరకొరే

Published Thu, Jul 14 2016 3:56 AM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM

low budget release for pending loans

పెండింగ్ వేతనాలకు నోచుకోని అంగన్‌వాడీలు
తీవ్ర నిరాశలో కార్యకర్తలు, ఆయాలు
అధికారుల అవసరాలకు మాత్రం దండిగా నిధులు

 ప్రొద్దుటూరు: అంగన్‌వాడీలకు మళ్లీ నిరాశే ఎదురైంది. పెరిగిన వేతనాలను మంజూరు చేస్తున్నట్లు మంత్రి పీతల సుజాత ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని తన కార్యాలయంలో ప్రకటించారు. దీంతో అంగన్‌వాడీలు తమకు పెరిగిన వేతనాలతోపాటు పెండింగ్ వేతనాలు వచ్చినట్లేనని ఎంతగానో ఆశపడ్డారు. తీరా బడ్జెట్‌ను చూస్తే అరకొరగా విడుదల చేయడంతో తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. జిల్లాకు సంబంధించి స్త్రీ శిశు సంక్షేమ శాఖ పరిధిలో మొత్తం 15 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. అంగన్‌వాడీలకు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పెరిగిన వేతనాలు చెల్లించాల్సి ఉంది. అలాగే నెలల తరబడి ఇంటి అద్దెలు, పాల కాంట్రాక్టర్లకు సంబంధించిన బిల్లులు, ఇతర బకాయిలు చెల్లించాల్సి ఉంది.

అయితే ఒకటి రెండు నెలలకు మాత్రమే బడ్జెట్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రొద్దుటూరు రూరల్ ప్రాజెక్టు పరిధిలో ప్రొద్దుటూరు, మైదుకూరు, చాపాడు, దువ్వూరు మండలాలకు సంబంధించి 328 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో పనిచేసే కార్యకర్తలు, ఆయాలకు కలిపి నెలకు రూ.35లక్షల వరకు వేతనాలు చెల్లించాల్సి ఉంది. ఈ ప్రకారం ఏప్రిల్, మే, జూన్ నెలలకుగాను రూ.కోటికిపైగా నిధులు అవసరం కాగా ప్రస్తుతం రూ.46,09,500 మాత్రమే మంజూరైంది. జిల్లావ్యాప్తంగా 15 ప్రాజెక్టులకు సంబంధించి 3,625 అంగన్‌వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. ఈ ప్రకారం ఖాళీలు పోను 7వేలమంది వరకు అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు పనిచేస్తున్నారు. మళ్లీ ప్రభుత్వం ఎప్పుడు బడ్జెట్ విడుదల చేస్తుందోనని అంగన్‌వాడీలు చర్చించుకుంటున్నారు. అలాగే అధికారులకు మాత్రం వాహనాల బాడుగలు, ప్రాజెక్టు కార్యాలయాల్లోని డాటా ఎంట్రీ ఆపరేటర్లకు వేతనాలు మంజూరు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement