పేదలకు సేవ చేయడం అదృష్టం
– పుట్టిన రోజు వేడుకల్లో ఎంపీ బుట్టారేణుక
– పేద మహిళలకు చీరల పంపిణీ
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): పేదలకు సేవ చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు కర్నూలు ఎంపీ బుట్టారేణుక పేర్కొన్నారు. బుధవారం వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఎంపీ బుట్టా రేణుక..జన్మదిన వేడుకలను యువజన, విద్యార్థి విభాగాల అధ్యక్షులు రాజవిష్ణువర్దన్‌రెడ్డి, అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై..ఎంపీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బుట్టా రేణుక.. ముఖ్యఅతిథుల సమక్షంలో భర్త నీలకంఠం, కుమారుడు అమోగ్‌లతో కలసి 46 కేజీల కేకును కట్ చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలకు పంచిపెట్టారు.
తరువాత వందమంది పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాలను వృద్ధిలోకి తీసుకురావడానికి తనవంతు కృషి చేస్తున్నాని తెలిపారు. ఎంపీ ల్యాడ్స్‌తో పలు గ్రామాల్లో మంచినీటి పథకాలు, రోడ్లు, మురుగు కాలువలను నిర్మించినట్లు వివరించారు. భవిష్యత్‌లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామన్నారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, లీగల్ సెల్ విభాగం జిల్లా అధ్యక్షుడు కర్నాటి పుల్లారెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు విజయకుమారి, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు టీవీ రమణ, నాయకులు కటారి సురేష్, సాంబ, పర్ల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.