సాయిమార్గంతోనే నవ సమాజస్థాపన
పుట్టపర్తి టౌన్ : సత్యసాయి చూపిన మార్గంలో పయనిస్తూ విలువలతో కూడిన సమాజ స్థాపన, సాధికారిత కోసం అధునిక మహిళ నడుంబిగించాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి వందితా శర్మ, సత్యసాయి సేవా సంస్థల మహిళా విభాగం దేశీయ కోఆర్డినేటర్ కమలా పాండ్య పిలుపునిచ్చారు. ప్రశాంతి నిలయంలో తొలి అఖిల భారత మహిళా సదస్సు శనివారం ప్రారంభమైంది. ఈసందర్భంగా వందితా శర్మ,కమలా పాండ్య మాట్లాడుతూ పురాణ కాలం నుంచి మహిళలు సమాజ నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారన్నారు. సమాజంలో మహిళల పాత్రను సత్యసాయి గుర్తించి, మహిళా సాధికారితకు పాటుపడ్డారన్నారు. ఆయన చూపిన ఆదర్శమార్గంలో నడుస్తూ మహిళలు నవసమాజ స్థాపనకు కషి చేయాలన్నారు.
దేశీయంగా వివిధ ప్రాంతాల్లో మహిళా విద్య, సాధికారితకు వివిధ రంగాల్లో పాటుపడిన మహిళామూర్తులను ఈశ్వరాంబ ట్రస్ట్ సభ్యురాలు చేతనారాజు సన్మానించారు. అంతకు మునుపు ఉదయం ప్రశాంతి నిలయంలోని సత్సంగ్ భవన్‌లో ‘శ్రీ సత్యసాయి అర్పణం’అన్న పేరుతో దేశీయ సత్యసాయి మహిళా విభాగం ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ట్రస్ట్ సభ్యుడు మద్రాస్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఎగ్జిబిషన్‌లో సత్యసాయి సేవా దళ్ సభ్యులు భారతీయ సంస్కతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ తయారు చేసిన కళా ఉత్పత్తులు, ఆయా ప్రాంతాల్లో చేపడుతున్న సేవా కార్యక్రమాలను, బాలవికాస్ విద్య ప్రాధాన్యతను, సత్యసాయి బోధనలను వివరిస్తూ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కర్ణాటక రాష్ట్రానికి చెందిన సత్యసాయి సేవా సంస్థల మహిళా విభాగం సభ్యులు, ముంబాయికి చెందిన చిన్నారులు సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించారు. సత్యసాయి ట్రస్ట్ సభ్యులు మద్రాస్ శ్రీనివాస్, ఆర్‌జే రత్నాకర్‌రాజు, నాగానంద, కార్యదర్శి ప్రసాద్‌రావు,ఈశ్వరాంబ ట్రస్ట్ సభ్యులు మాధురీనాగానంద్, సేవా సంస్థల దేశీయ అధ్యక్షుడు నిమిష్‌పాండ్య పాల్గొన్నారు.