శ్రీమల్లికార్జునస్వామి వారి మూలవిరాట్
గంగను విడిచిన విభునికి... విడతల వారీగా అభిషేకం
Published Fri, Aug 19 2016 12:50 AM | Last Updated on Mon, Oct 8 2018 9:10 PM
– కృష్ణా పుష్కరాల సందర్భంగా అభిషేకాల నిలుపుదల
– వారం తర్వాత నిర్ణయం మార్చుకున్న అధికారులు
– ప్రతి మూడు గంటలకు ఒకసారి శాస్త్రోక్తంగా మల్లన్నకు అభిషేకం
శ్రీశైలం: వారం రోజులుగా అభిషేకాలకు దూరంగా ఉన్న శ్రీశైల మహా చక్రవర్తికి విడతల వారీగా అభిషేకాలు నిర్వహించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా పుష్కరాల్లో పుణ్య స్నానాలు చేసేందుకు నీళ్లు లేవని భక్తులు, అధికారులు ఆందోళన చెందుతున్న తరుణంలో శివుడు గంగను విడవటంతో కృష్ణమ్మ బిరబిరమంటూ పరుగులెత్తింది. భక్తులు పుష్కర స్నానం చేసి పునీతలయ్యారు. అయితే పుష్కరాల సందర్భంగా భక్తుల రద్దీ మేరకు అభిషేకాలను నిలుపుదల చేశారు. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో కొందరు విమర్శలు చేశారు. కనీసం స్వామివార్ల రుద్రాక్ష మండపానికి ఉండే ఘంటాపాత్రోలో నైనా నీటిని పోసి నిరంతరం శ్రీశైలమహాలింగ చక్రవర్తి శిరస్సుపై నీరు పడేలా ఏర్పాటు చేసి ఉండాల్సింది. ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి అధికారుల ఆలోచనలలో మార్పు వచ్చింది. గురువారం ఉదయం 11.30 గంటలకు మల్లికార్జునస్వామికి మహా నైవేద్యం ముగిశాక ఈఓ భరత్ గుప్త ద్వారా ఆలయప్రధానార్చకులు, అర్చకులతో వేదమంత్రోచ్చరణలతో శాస్త్రోక్తంగా ప్రతి మూడు గంటలకు ఒకసారి మల్లన్నకు అభిషేకం నిర్వహించాలని ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. దీంతో ఒక్కసారిగా ఆలయప్రాంగణం అభిషేక సమయాన ఆధ్యాత్మిక వేదమంత్రోచ్చరణల తరంగాలతో ప్రభావితమైంది. అనంతరం తిరిగి 2.30 గంటల నుంచి 3.30గంటల వరకు అర్చకులు రుద్రాభిషేకంతో మల్లన్నకు పరమానందం కలిగిందనే చెప్పవచ్చు. అలాగే సాయంత్రం కూడా ఒకసారి, రాత్రి మరోసారి మల్లన్నకు రుద్రాభిషేకం నిర్వహించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పుష్కరాలలో మిగిలిన అన్ని రోజులు ఈ అభిషేకం కొనసాగించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏలా ఉన్నా అభిషేక ప్రియుడైన శ్రీశైల మల్లికార్జునస్వామికి ఏదో రూపేణా అభిషేకం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవడం శుభపరిణామంగా భక్తులు పేర్కొంటున్నారు.
Advertisement