ఆస్పత్రిలో ప్రసవమై వైద్య చికిత్సలో ఉన్న బాలింత పట్ల ఓ కామాంధుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు.
మైలవరం (కృష్ణా జిల్లా) : ఆస్పత్రిలో ప్రసవమై వైద్య చికిత్సలో ఉన్న బాలింత పట్ల ఓ కామాంధుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా మైలవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో శనివారం సాయంత్రం జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... రెడ్డిగూడెం మండలం నాగులూరుకు చెందిన ఓ మహిళ మూడు రోజుల క్రితం మైలవరంలోని విజయవాడ బస్టాప్ వెనుక గల ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రసవించింది.
కాగా తారకరామ నగర్‌కు చెందిన రామకృష్ణ అనే వ్యక్తి ఆస్పత్రి ఎదురుగా ఉన్న ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తుంటాడు. శనివారం సాయంత్రం రామకృష్ణ ఆస్పత్రిలోకి ప్రవేశించి సదరు బాలింత బెడ్ దగ్గరకు వెళ్లాడు. డాక్టర్ గారు పంపారు, వైద్య పరీక్షలు చేయాలంటూ అక్కడున్న అటెండెంట్‌ను బయటకు పంపించాడు. తర్వాత బాలింత శరీరాన్ని చేతులతో తడుముతూ అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు తన సెల్‌ఫోన్‌లో ఫొటోలు కూడా తీశాడు. ఆస్పత్రి సిబ్బంది గమనించేసరికి పారిపోయే ప్రయత్నం చేశాడు. రోగి బంధువులు రామకృష్ణను పట్టుకుని చితక్కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.