
రోడ్డు ప్రమాదంలో తెగిపడిన చెయ్యి
కందుకూరు : కందుకూరు ఠాణా పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి చెయ్యి తెగిపడింది. మహేశ్వరం మండలం గంగారం గ్రామానికి చెందిన సాయిలు (45) మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని చెవులపల్లి వద్ద ఉన్న తన పొలానికి బైక్‌పై వెళ్లి, మంగళవారం రాత్రి తిరుగు పయనమయ్యాడు. మార్గమధ్యంలో పులిమామిడి, మహేశ్వరం రహదారిపై కేకే బస్తీ బస్‌స్టాప్ వద్ద ఓ ఆటో, అతడి బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో సాయిలు కుడి చెయ్యి తెగిపడగా, మరో కాలు, చెయ్యి కూడా విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో ఆటో బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న చిప్పలపల్లికి చెందిన ఆంజనేయులుకు తీవ్ర గాయాలవగా.. తెగిపడిన చెయ్యితో సహా అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా, వైద్యులు చికిత్స చేస్తున్నారు. మామిళ్ల అనసూయ, ప్రేమలత, లావణ్య, పెంటయ్య స్వల్పంగా గాయపడగా, వీరిని కూడా అదే ఆస్పత్రికి తరలించారు.