నిర్మల్ జిల్లాకు చెందిన మంగీదళ మావోయిస్టు సభ్యుడు కంతి రవి అలియాస్ సురేశ్ శనివారం ఎస్పీ విష్ణు వారియర్ ఎదుట లొంగిపోయాడు.
నిర్మల్ టౌన్ : నిర్మల్ జిల్లాకు చెందిన మంగీదళ మావోయిస్టు సభ్యుడు కంతి రవి అలియాస్ సురేశ్ శనివారం ఎస్పీ విష్ణు వారియర్ ఎదుట లొంగిపోయాడు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. కడెం మండలం లక్ష్మీసాగర్ గ్రామానికి చెందిన కంతి రవి అలియాస్ సురేశ్ 2014 నుంచి ఉమ్మడి జిల్లాకు మావోయిస్టు జిల్లా కార్యదర్శిగా ఉన్న మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్‌కు గన్‌మెన్‌గా పనిచేశాడు. రవి సొంత సోదరి కంతి లింగవ్వ అలియాస్ అనిత 20 ఏళ్ల క్రితం అడెల్లును వివాహం చేసుకోగా.. అప్పటి నుంచి వీరు ఇరువురు అక్కాతమ్ముడు అజ్ఞాతంలోకి వెళ్లారు.
2014లో రవి దళంలో చేరాడు. కొంతకాలం పనిచేసిన తర్వాత మెట్‌పల్లి ప్రాంతంలో తలదాచుకున్నాడు. మావోయిస్టు కార్యకలాపాలు కొనసాగిస్తున్న రవిని ఖానాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి గతంలో తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. ఆ తర్వాత తన సొంత గ్రామంలో తలదాచుకుంటూ పాత ఎల్లాపూర్ గ్రామానికి చెందిన చుంచుల బక్కన్న సాయంతో ఖానాపూర్ మండలంలోని సోమవార్‌పేట్ కొలాంగూడకు చెందిన ఆత్రం శ్రీను, సెడం లక్ష్మణ్, ఆత్రం భీంరావులను మావోయస్టు దళంలో చేర్పించాడు.
అలాగే గ్రామంలో ఉంటూ వాల్‌పోస్టర్లు వేయడం వంటి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనేవాడు. 2014లో ఎదురుకాల్పులు జరిగిన ఘటనలో రవి త్రుటిలో తప్పించుకోగా, సెడం లక్ష్మణ్ లొంగిపోయాడు. దీంతో సెడం లక్ష్మణ్ వాగ్మూలం ప్రకారం కంతి రవి విషయాలు బట్టబయలయ్యాయి. ఆ తర్వాత జిల్లా కార్యదర్శి మైలారపు అడెల్లుకు గన్‌మన్‌గా పనిచేస్తూ మంగీదళ సభ్యుడిగా నియమితుడయ్యాడు. ఈ సమయంలోనే మైలారపు అడెల్లు అతని భార్య కంతి లింగవ్వ పోలీసులకు లొంగిపోయారు. ప్రతీకారేచ్ఛతో సానుభూతిపరుడి హత్య మంగీదళంలో ఉన్న కంతి రవి మహారాష్ర్టలోని అహేరి పోలీస్‌స్టేషన్ ఏరియా పరిధిలో ఎన్‌కౌంటర్ జరగగా అప్పుడు తప్పించుకున్నాడు. కానీ.. అదే ఘటనలో రఘు అలియాస్ దిలీప్, సోని, కమల చనిపోయారు.
దీంతో ప్రతీకారంగా తన తోటి సభ్యులతో కలిసి రవి తిర్యాణి మండలానికి చెందిన సానుభూతి పరుడు బల్లార్షను కాల్చి చంపారు. అలాగే గోదావరి వంతెన నిర్మిస్తున్న కాంట్రాక్టర్‌కు చెందిన డంపర్, ట్రాక్టర్లను తగులబెట్టారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మావోయిస్టు దళంలో 8 మంది మిగలగా అందులో మైలారపు అడెల్లు అతని భార్య లింగవ్వ జిల్లా వాసులు కాగా మిగతా వారు ఛత్తీస్‌ఘడ్ వారీగా ఉన్నారు. పలుమార్లు ఎన్‌కౌంటర్‌లో తప్పించుకున్న కంతి రవి తన తల్లి, తన అనారోగ్య కారణాలతో ఎస్పీ కార్యాలయంలో లొంగిపోయాడు.