పాసైనా ఫెయిలే..
పాసైనా ఫెయిలే..
Published Sun, Jul 17 2016 11:36 PM | Last Updated on Tue, Nov 6 2018 5:13 PM
పర్సనల్ ఐడెంటిఫికేషన్‌లో నిగ్గుతేలుతున్న నిజాలు
తప్పుల తడకగా మార్కుల జాబితాలు
ఆందోళనలో విద్యార్థులు
నందగోపాల్ (పేరు మార్చాం) డిగ్రీ ఫైనలియర్ పరీక్షలు రాశాడు. పరీక్షలు బాగా రాసినప్పటికీ ఫెయిల్ చేశారు. డిగ్రీ మొదటి, రెండో సంవత్సరం పరీక్షల్లో అన్ని సబ్జెక్టులు 70 శాతం పైగా వచ్చాయి. దీంతో పీజీలో ర్యాంకు వచ్చినప్పటికీ అవకాశం దక్కలేదు. ప్రతిభావంతుడైన విద్యార్థి కావడంతో అనుమానం వచ్చింది. పర్సనల్ ఐడెంటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకొన్నాడు. తీరా చూస్తే ఉత్తీర్ణుడయ్యాడు. అపుడు మార్కులు సరిగా లెక్కించకపోవడంతో ఫెయిల్ అయినట్లు ప్రకటించారు. ఇలా నందగోపాల్ ఒక్కడే కాదు ఇలాంటి బాధితులు అనేక మంది ఉన్నారు.
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో డిగ్రీ పరీక్షల మూల్యాంకనంలో అధ్యాపకుల నిర్లక్ష్యానికి విద్యార్థులు బలిఅవుతున్నారు. కొందరు విద్యార్థులు ఉత్తీర్ణులైనప్పటికీ ఫెయిల్ అయినట్లు నిర్ధారించడంతో బాధిత విద్యార్థులు లబోదిబోమంటున్నారు. పర్సనల్ ఐడెంటిఫికేషన్‌లో నిజాలు నిగ్గుతేలుతున్నాయి. జవాబు పత్రాలు మూల్యాంకనం అనంతరం ప్రత్యేకంగా స్రూటినీ చేస్తారు. అవార్డు షీట్‌లో మార్కులు వేసిన తరువాత యూజీ విభాగంలోని బోధనేతర సిబ్బందితో స్పెషల్ అసిస్టెన్స్ నిర్వహిస్తారు. ఆవార్డుషీట్, జవాబు పత్రంలోని మార్కులు మధ్య వ్యత్యాసాలను పరిశీలిస్తారు. అయినప్పటికీ తప్పిదాలు చోటు చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మార్క్స్‌కార్డుల్లో మార్కుల గల్లంతు
ప్రొవిజనల్ మార్క్స్ కార్డులు కూడా తప్పుల తడకగా మారాయి. భాస్కర్ అనే విద్యార్థికి వాస్తవానికి పేపర్ – 2 లో 1226 మార్కులు రావాల్సి ఉంది. కానీ 1150 మార్కులుగా తప్పుల తడకగా నమోదు చేశారు. మూల్యాంకనంతో పాటు మార్కుల నమోదులోనూ సిబ్బంది తాత్సారం స్పష్టంగా తెలుస్తోంది. అధికారులు కూడా నిబంధనలకు తిలోదకాలు ఇవ్వడంతో విద్యార్థుల గోడును పట్టించుకునేనాథుడే కరువయ్యారు.
Advertisement
Advertisement