అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
Published Fri, Oct 14 2016 8:44 PM | Last Updated on Mon, Sep 4 2017 5:12 PM
ప్రియుడితో ఉండగా దుర్ఘటన
గుంటూరు ఈస్ట్: లాడ్జి గదిలో ప్రియుడితో ఉన్న ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. వరంగల్‌కు చెందిన ఆమె ఫేస్‌బుక్ ద్వారా ఏర్పడిన పరిచయంతో గుంటూరు వచ్చి ప్రియుడితో లాడ్జి గదిలో గడుపుతూ మృతి చెందింది. ఎస్‌హెచ్‌ఓ వెంకన్న చౌదరి తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా పరకాలకు చెందిన చైతన్య (25) అనే వివాహితకు ఇద్దరు పిల్లలు. భర్తతో గొడవలు పడి విడిపోయింది. సెల్ ఫోన్‌లో ఫేస్ బుక్ ద్వారా గుంటూరులోని గుంటూరువారి తోట 4వ లైనుకు చెందిన జర్నెపూడి శివప్రసాద్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ తరచు వరంగల్, గుంటూరులలో కలుసుకునే వారు. ఇదే క్రమంలో ఈ నెల 12వ తేదీన చైతన్య గుంటూరుకు రాగా శివప్రసాద్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న అశ్విని లాడ్జిలో ఏసీ గది అద్దెకు తీసుకున్నాడు. ఒకరోజు ఇద్దరూ అందులో గడిపిన తరువాత నాన్ ఏసీ రూమ్‌లోకి మారారు. ఎమైందో తెలీయదు కానీ శుక్రవారం ఉదయం చైతన్య మృతి చెందిందంటూ శివప్రసాద్ కొత్తపేట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఎస్‌హెచ్‌ఓ వెంకన్న చౌదరి మృతదేహాన్ని పరిశీలించి జీజీహెచ్‌లోని అత్యవసర విభాగానికి తరలించారు. వైద్యుల మరణ ధ్రువీకరణ అనంతరం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement