వనంలోకి జన దేవతలు
తిరిగి అడవిలోకి ప్రవేశించిన సమ్మక్క, సారలమ్మలు
సాక్షి ప్రతినిధి, వరంగల్: లక్షలాది మంది భక్తుల పూజలందుకున్న వన దేవతలు శనివారం తిరిగి వన ప్రవేశం చేశారు. నాలుగు రోజులపాటు వైభవంగా జరిగిన మేడారం మహా జాతర ముగిసింది. ఆదివాసీ సంప్రదాయాలతో పూజారులు (వడ్డెలు) దేవతలను శనివారం సాయంత్రం అడవిలోకి తీసుకెళ్లారు. లక్షలాది మంది భక్తుల మధ్య నలుగురు దేవతల వన ప్రవేశ ఘట్టం ఉద్విగ్నంగా సాగింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా జాతర చివరిరోజు అయిన శనివారం దాదాపు 8 లక్షల మంది సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్నారు. దేవతల వనప్రవేశం పూర్తయిన తర్వాత సమ్మక్క గద్దెపై భక్తులు సమర్పించిన చీరసారె, బంగారం, పసుపు కుంకుమలను మేడారం వాసులు తీసుకున్నారు. దేవతల ప్రసాదాన్ని తీసుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. దేవతల వన ప్రవేశం తర్వాత కూడా పెద్ద సంఖ్యలో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
ప్రత్యేక పూజలతో..
దేవతల వన ప్రవేశ ఘట్టం శనివారం సాయంత్రం ప్రత్యేక పూజలతో ప్రారంభమైంది. సాయంత్రం ఆరు గంటల సమయంలో దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు. మొదట గోవిందరాజును దబ్బగట్ల గోవర్దన్, పోదెం బాబు నేతృత్వంలోని పూజారుల బృందం గద్దెల నుంచి ఆరు గంటలకు కదిలించి.. ఏటూరునాగారం మండలం కొండాయికి తరలించారు. అనంతరం 6.24 గంటలకు కొక్కెర కృష్ణయ్య, సిద్దబోయిన మునీందర్ నేతృత్వంలోని పూజారుల బృందం గద్దెల వద్ద పూజలు నిర్వహించి సమ్మక్కను అక్కడి నుంచి కదిలించారు. గద్దెల సమీపంలోని ఎదుర్కోళ్ల ప్రదేశం వద్ద మేకను బలిచ్చి, పూజలు చేశారు.
తర్వాత సమ్మక్కను చిలుకలగుట్టకు చేర్చారు. ఇక సమ్మక్క భర్త పగిడిద్దరాజును 6.28 గంటలకు పెనక బుచ్చిరాములు నేతృత్వంలోని పూజారుల బృందం తరలించి... కొత్తగూడ మండలం పూనుగొండ్ల వైపు తీసుకెళ్లింది. ఆదివారం సాయంత్రం వారు గమ్యాన్ని చేరుకుంటారు. ఇక సారలమ్మను కాక సారయ్య, కాక కిరణ్, సోలం వెంకటేశ్వర్లు నేతృత్వంలోని పూజారుల బృందం కదిలించింది. గద్దెపై ప్రతిష్ఠించిన మెంటె(వెదురుబుట్ట)ను 6.35 గంటలకు తీసుకుని జంపన్న వాగు మీదుగా కన్నెపల్లికి చేర్చింది. భక్తులు ఈ సమయంలో పూజారులను తాకి, మొక్కుకోవడానికి ప్రయత్నించారు. మొత్తంగా దేవతల వన ప్రవేశంతో మేడారం మహాజాతర అధికారికంగా ముగిసింది. బుధవారం నిర్వహించే తిరుగువారం పండుగతో మహా జాతర పరిసమాప్తమవుతుంది. అప్పటిదాకా భక్తులు గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకుంటూనే ఉంటారు.
సారలమ్మ గద్దెపై పోలీసు అధికారి
మేడారం మహాజాతరలో పోలీసుల అత్యుత్సాహం చివరిరోజు కూడా కొనసాగింది. దేవతల వన ప్రవేశ ఘట్టం మొదలుకాగానే వడ్డెలు గద్దెలపైకి చేరుకుని పూజలు మొదలుపెట్టారు. ఈ సమయంలో స్థానిక ఆదివాసీలు మాత్రమే గద్దెలపై ఉంటారు. అరుుతే మేడారంలో విధులు నిర్వహిస్తున్న ఏటూరునాగారం సీఐ కిశోర్‌కుమార్ అత్యుత్సాహంతో యూనిఫామ్‌తోనే సారలమ్మ గద్దెపైకి ఎక్కారు. ఆదివాసీలు ఎంత చెప్పినా వినలేదు. చివరికి వారు నిరసన తెలపడంతో కిందికి దిగారు. ఇదే సమయంలో సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య గద్దెల ఆవరణలోకి వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. తాను ప్రధాన పూజారినని చెప్పినా గేటు తీయలేదు. దీంతో సారయ్య వెనక్కి వెళ్లిపోయారు. కానీ మిగతా పూజారులు సారయ్య ప్రధాన పూజారి అని చెప్పడంతో పోలీసులు వెళ్లి మళ్లీ తీసుకొచ్చారు.
జాతరకు ప్రపంచ స్థారుు గుర్తింపు తెస్తాం: దత్తాత్రేయ
ఏటూరునాగారం/కాశిబుగ్గ: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, విశ్వాసానికి మారుపేరైన సమ్మక్క, సారలమ్మ జాతరకు యునెస్కో సహకారంతో ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చేలా కృషి చేస్తామని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. ఆయన శనివారం కుటుంబ సమేతంగా మేడారంలో వన దేవతలను దర్శించుకున్నారు. అనంతరం తన ఎత్తు బంగారాన్ని (బెల్లం) సమర్పించారు. ఈ సందర్భంగా మేడారంలో, వరంగల్‌లో దత్తాత్రేయ విలేకరులతో మాట్లాడారు. సమ్మక్క, సారలమ్మ తల్లుల మహిమ అమోఘమైనదని, జాతర ఏర్పాట్లలో రాష్ట్ర ప్రభుత్వం విజయవంతమైందని పేర్కొన్నారు. దేశంలో గిరిజన సంప్రదాయానికి ప్రత్యేక పవిత్రత ఉందని, దానిని కాపాడుకుంటూ జాతర నిర్వహించాలని చెప్పారు.
‘మేడారం’ విజయవంతంపై సీఎం హర్షం
సాక్షి, హైదరాబాద్: మేడారం సమ్మక్క సారలమ్మ జాతర విజయవంతంగా ముగించడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. జాతర కోసం రేయింబవళ్లు పనిచేసిన అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అన్ని శాఖలను సమన్వయపరిచి జాతరను అద్భుతంగా జరిగేందుకు కృషి చేసిన కలెక్టర్, ఎస్పీ, ఇతర శాఖల అధికారులు, వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులకు సీఎం అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోయేవిధంగా సమ్మక్క సారలమ్మలు దీవిస్తారని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.
జాతర విజయవంతం: ఇంద్రకరణ్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను అందరి సహకారాలతో విజయవంతంగా నిర్వహించగలిగామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకున్నామని చెప్పారు. అధికారులు ముందు నుంచి ప్రణాళికతో సాగడంతో జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగలేదని ఆయన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 6 నెలల ముందునుంచి చేపట్టిన పనులు భక్తులకు ఎంతో ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు.
సమన్వయంతోనే సక్సెస్..
‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారి జరిగిన మేడారం మహా జాతర విజయవంతమైంది. రెండు నెలల నుంచి భక్తులు వచ్చారు. జాతర నాలుగు రోజులు భారీ సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. సౌకర్యాల కల్పనలో సీఎం కేసీఆర్, స్పీకర్ మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్ ఎప్పటికప్పుడు సూచనలు చేశారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో మహా జాతర విజయవంతమైంది..’’
- వాకాటి కరుణ, వరంగల్ జిల్లా కలెక్టర్