ఆరోగ్యమస్తు
ఆరోగ్యమస్తు
Published Wed, Aug 3 2016 11:29 PM | Last Updated on Thu, Mar 21 2019 8:29 PM
పుష్కరాలకు సన్నద్ధం అవుతున్న వైద్యారోగ్యశాఖ
– ఘాట్ల వద్ద తాత్కాలిక ఆస్పత్రుల ఏర్పాటు
– అత్యవసర పరీక్షలకు అందుబాటులో వైద్య పరికరాలు
– 635మందితో శిబిరాల నిర్వహణ
– రూ.80లక్షల మందులకు ప్రతిపాదనలు
మహబూబ్‌నగర్ క్రైం: కృష్ణా పుష్కరాల కోసం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పూర్తిస్థాయిలో సన్నద్ధం అవుతోంది. కోట్ల మంది భక్తులు హాజరవుతున్న ఈ పుష్కరాలలో వైద్య ఆరోగ్య శాఖ కీలక పాత్ర పోషించనుంది. ఇప్పటికే పుష్కరాల నిర్వహణ కోసం కావాల్సిన నిర్ణయాలు తీసుకున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ పాత్ర విజయవంతం చేయడానికి అదనపు జేసీ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. కలెక్టర్ టీకే శ్రీదేవి ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తూ, కావాల్సిన ఏర్పాట్లను పర్యవేక్షణ చేస్తున్నారు. సభ్యులుగా అదనపు జేసీ, డీఎంహెచ్‌ఓ, జిల్లాసుపత్రి సూపరింటెండెంట్, ఆస్పత్రి ఈఈలున్నారు.
4 ఘాట్లలో 24గంటలూ సేవలు
పుష్కరాల కోసం ఘాట్లలో 108 అంబులెన్స్‌లు 25, 104వాహనాలు 27 అందుబాటులో ఉంచనున్నారు. జిల్లాలో నాలుగు ప్రధాన ఘాట్లు బీచుపల్లి, గొందిమళ్ల, పసుపుల, కృష్ణలలో 10పడకల తాత్కాలిక ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఘాట్‌కు ఓ ప్రత్యేక వైద్యుడు అందుబాటులో ఉంటూ భక్తులకు 24గంటల పాటు సేవలు అందించనున్నారు. మరో ఆరు ఘాట్లలో నాలుగు పడకల ఆస్పత్రులు, 15ఘాట్లలో రెండు పడకల ఆస్పత్రులు ఏర్పాటు చేయనున్నారు. వీటిలో 12గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. పుష్కరఘాట్‌లలో ఏర్పాటు చేసే తాత్కాలిక ఆస్పత్రులను రేకులతో నిర్మాణం చేయనున్నారు. అలాగే అత్యవసరంగా పరీక్షలు చేయడానికి పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే అత్యవసర వైద్యం అందించడానికి ఓ ఐసీయూ బెడ్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఘాట్‌లో ఓ ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేసి అక్కడ కావాల్సిన మందులను అందుబాటులో ఉంచనున్నారు. ఇందుకోసం వైద్య ఆరోగ్యశాఖ దాదాపు రూ.80లక్షల మందులకు ప్రతిపాదనలు పంపించింది.
635సిబ్బందితో వైద్య సేవలు..
జిల్లాలో పుష్కరఘాట్‌లలో వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేయబోతున్న తాత్కాలిక ఆస్పత్రులతో పాటు వైద్య శిబిరాలలో వైద్య సేవలు అందించడానికి ఆ శాఖ 635మందిని నియమించింది. ఇందులో 48మంది ప్రత్యేక వైద్యులు, 157మంది ఎంబీబీఎస్ వైద్యులు, ఇతర స్టాఫ్ నర్సులు, వార్డు బాయ్స్, సిబ్బంది ఉండనున్నారు. ప్రతి అత్యవసర ఘాట్‌లో నలుగురు ప్రత్యేక వైద్యులు అందుబాటులో ఉండి సేవలు చేస్తారు. అయితే పుష్కరాలలో మందుల కొనుగోలు విషయంలో ఎలాంటి అవినీతి జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మందుల బాధ్యతను జీవనధారకు అప్పగించింది. నాలుగు ప్రాంతాల్లో ఏజేన్సీ వారు వైద్య శిబిరాలను పర్యవేక్షణ చేయనున్నారు.
సిబ్బంది కొరత..
పుష్కరాల కోసం వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించిన విధంగా చూస్తే జిల్లాలో ఉండే సిబ్బంది సరిపోవడం లేదు. అయితే జిల్లాలో 195వైద్య పోస్టులు ఉంటే వాటికి 167మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఇంకా ఇతర జిల్లాల నుంచి 300మంది వైద్యుల వరకు అవసరం ఉంది. ఇతర పారామెడికల్ సిబ్బంది 3వేల వరకు అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అయితే ఇందులో సూపర్‌వైజర్లు, హెల్త్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. అయితే ఇతర జిల్లాల నుంచి దాదాపు 700మంది సిబ్బందిని రప్పించాల్సిన అవసరం ఉంది.
కసరత్తు చేస్తున్నాం..
జిల్లాలో పుష్కరాలను విజయంవంతం చేయడానికి పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నాం. ఇప్పటికే ముఖ్య ఘాట్లను గుర్తించాం. కొన్ని ఘాట్లలో పది పడకలు, నాలుగు పడకలు, రెండు పడకల తాత్కాలిక ఆస్పత్రుల నిర్మాణం చేస్తాం. భక్తులను దృష్టిలో పెట్టుకుని మరింత వైద్య శిబిరాలు పెంచడానికి కృషి చేస్తాం. ప్రస్తుతం శాఖాపరంగా కావాల్సిన ఏర్పాట్లలో బిజీగా ఉన్నాం.
–డాక్టర్‌నాగారాం, డీఎంహెచ్‌వో
Advertisement
Advertisement