శ్రీకాకుళం రోడ్ ( ఆమదాలవలస) రైల్వే స్టేషన్‌లో వీరావళికి ప్రయాణమై పోటెత్తిన మత్స్యకారులు.
బతుకు వెతుక్కుంటూ...
Published Sun, Aug 7 2016 11:04 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM
♦ ఉపాధి లేక వలస బాట
♦ వలస వెళ్తున్న మత్స్యకారులతో నిండిన రైల్వే స్టేషన్
ఆమదాలవలస: సంక్షేమ పథకాలు, ఉపాధి హామీలు మత్స్యకారులకు భరోసా ఇవ్వలేకపోతున్నాయి. కష్టకాలంలో బతుకు వెతుక్కుంటూ గంగపుత్రులు వేరే రాష్ట్రాలకు వలస వెళ్లిపోతున్నారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, మత్స్యకారులకు కరువు భత్యం వంటి మాటలు చెప్పిన వారు చేసిన మోసం వల్లనే తాము ఇలా వలస వెళ్లాల్సి వస్తోందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్ రాష్ట్రం వీరావళికి వెళ్లేందుకు ప్రయాణమైన ప్రయాణికులు(మత్స్యకారులతో) ఆమదాలవలస రైల్వే స్టేషన్ ఆదివారం రద్దీగా కనిపించింది.
వీరావళికి ప్రయాణం
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన డి.మచిలేశ్వరం, చింతపల్లి, జీరుపాలేం, గణగలపేట, కొమరవానిపేట, రాళ్లపేట, బడివానిపేట, బోడుగుట్ల పాలేం, జీరుపాలేం, కొవ్వాడ, కొత్తముఖవాడ తదితర గ్రామాలకు చెందిన వేల సంఖ్యలో యువకులు, పురుషులు అందరూ గుజరాత్ రాష్ట్రంలోని వీరావళికి ప్రయాణ మయ్యారు. వీరంతా అక్కడ సముద్రంలో చేపల వేటకు వెళ్తున్నామని చెబుతున్నారు. అక్కడ బోట్‌లలో వెళ్లి చేపలు వేటాడుతామని, నెలకు భోజనాలు పెట్టుకొని రూ..7వేలు జీతం ఇస్తారని తెలిపారు. ఎనిమిది నెలల వరకు అక్కడ ఉండి మళ్లీ సంక్రాంతి వెళ్లాక నాలుగో నెలలో తిరిగి ఇంటికి వస్తామని చెబుతున్నారు. అంతవరకు తమ కుటుంబాలను విడిచి పెట్టి, భార్యా బిడ్డలకు దూరంగా ఉంటూ పొట్టకూటి కోసం పనిచేస్తామని చెప్పారు. గ్రామాల్లో పనులు లేకపోవడంతోనే వలస వెళ్తున్నామని, ఉపాధి ఉంటే వెళ్లేవారం కాదని అన్నారు. డిగ్రీలు, పీజీలు పూర్తి చేసి ఉద్యోగ అవకాశాలు లేక ఇలా వేరే రాష్ట్రాల్లో పనులు చేసుకుంటున్నామని యువకులు చెబుతున్నారు.
Advertisement
Advertisement