మినరల్ వాటర్ తియ్యగా ఉండొద్దు..
కలెక్టర్ రోనాల్డ్‌రాస్
పటాన్‌చెరు/రామచంద్రాపురం: కలెక్టర్ రోనాల్డ్‌రాస్ శనివారం పటాన్‌చెరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పటాన్‌చెరు పట్టణంలోని రామేశ్వరంబండలో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద చేపడుతున్న ఇళ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడున్న రైల్వే భూములను పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిమిత్తం కేటాయించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ వి.భూపాల్‌రెడ్డి కోరారు.
విషయాన్ని పరిశీలిస్తానని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. అలాగే, రామచంద్రాపురం పట్టణంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ప్రజలకు ఉచితంగా తాగునీటిని అందించేందుకు కొనుగోలు చేసిన ట్యాంకర్లను కలెక్టర్ ప్రారంభించారు. తమ సొంత డబ్బులతో ట్యాంకర్ల ద్వారా ప్రజలకు తాగునీటిని అందించనున్నట్టు వారు కలెక్టర్‌కు చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ వాటర్ ట్యాంకర్‌ను నడిపారు. అనంతరం ఇక్రిశాట్ ఫెన్సింగ్ కాలనీలో కలెక్టర్ మినరల్ వాటర్‌ప్లాంటు పనులను ప్రారంభించారు.
నీళ్లు తియ్యగా ఉంటాయా..
రామచంద్రాపురం : ఈ నీళ్లు తీయ్యగా ఉంటాయా.. అవును సార్.. అయితే ఈ నీళ్లు ప్రజలకు అవసరం లేదు. అన్నారు కలెక్టర్.. ఈ సంభాషణ పట్టణంలోని భారతీనగర్ కాలనీ మినరల్ వాటర్ ప్లాంట్‌ను సందర్శించిన కలెక్టర్ మినరల్ వాటర్ ప్లాంట్ నిర్వాహకుణ్ని ప్రశ్నించారు. భారతీనగర్‌లోని మినరల్ వాటర్ ప్లాంటు పనితీరును కలెక్టర్ పరిశీలించారు. వాటర్ ప్లాంటు ఏర్పాటు చేసిన సంస్థ నిర్వాహకుణ్ని ప్లాంటు ఏ విధంగా పనిచేస్తుందో అడిగి తెలుసుకున్నారు. నీళ్లు తియ్యగా ఉంటాయా అని కలెక్టర్ ప్రశ్నించారు. దీంతో నిర్వాహకులు అవును సార్ తియ్యగా ఉంటాయని చెప్పారు. వెంటనే స్పందించిన కలెక్టర్ ఎక్కువ తియ్యగా ఉంటే మంచిది కాదని నిర్వాహకులకు తెలిపారు. బోరు నుంచి తీసిన నీటిని శుద్ధి చేసి తగిన మోతాదులో మినరల్ కలిపితే సరిపోతుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, కార్పొరేటర్ సింధూ ఆదర్శ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.