అచ్చెన్నకు ‘గంటా’ చెక్!
ఒక్క సిఫారసూ అమలు చేయని వైనం
శ్రీకాకుళం : జిల్లా విద్యాశాఖలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మంత్రి అచ్చెన్నాయుడుకు చెక్ పెడుతూ వస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నారుు. అచ్చెన్నాయుడు సోదరుడు ఎర్రన్నాయుడు ఎంపీగా ఉన్ననాటి నుంచి వారి కుటుంబంతో గంటాకు మంచి సంబంధాలు ఉండేవి. ఎర్రన్నాయుడు మర ణానంతరం అదే పంథాను కొనసాగిస్తూ వచ్చారు. అయితే ప్రస్తుత శ్రీకాకుళం జెడ్పీ సీఈఓ నగేష్ నియామకం నుంచి అచ్చెన్నాయుడు, గంటాల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయనే ప్రచారం ఉంది.
నగేష్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఓఎస్‌డీగా వ్యవహరించేవారు. అప్పట్లో విశాఖ జిల్లాకు చెందిన మరో మంత్రి అయ్యన్నపాత్రుడు చెప్పిన ఓ పనిని గంటాకు తెలియకుండా నగేష్ చేయడంతో ఆయను ఓఎస్‌డీగా తొలగించినట్లు అప్పట్లో వ్యాఖ్యానాలు ఉండేవి. అటు తరువాత పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న అయ్యన్నపాత్రుడు నగేష్‌ను శ్రీకాకుళం జెడ్పీ సీఈవోగా నియమించాలని యోచిస్తూ మంత్రి అచ్చెన్న అడుగగా దానికి ఆయన సమ్మతించడంతో నగేష్ సీఈఓగా శ్రీకాకుళంలో బాధ్యతలు చేపట్టారు. దీన్ని గంటా కాస్త సీరియస్‌గానే తీసుకున్నారని అప్పట్లో ఆయన అనుయాయులే చెప్పారు. అచ్చెన్నతో సజావుగా ఉంటున్నట్లు ప్రవర్తిస్తున్నా అనేక సందర్భాల్లో ఆయన చేసిన సిఫారసులు అమలుకు నోచుకోకపోవడం ఈ సందర్భంగా గమనార్హం. వాటిని పరిశీలిస్తే..
రాజీవ్ విద్యా మిషన్ పీవోగా గతంలో రామచంద్రారెడ్డి పనిచేశారు. ఆయన్ని ఓ సందర్భంలో మంత్రి గం టా శ్రీనివాసరావు స్వయంగా మాతృ సంస్థకు సరెండర్ చేస్తూ ఉత్తర్వులు వెలువరించారు. అయితే ఆయనను రిలీవ్ చేయకుండా ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి రామచంద్రారెడ్డిని కొనసాగించేందుకు మంత్రి అచ్చెన్న ప్రయత్నాలు చేశారు. సుమారు రెండు నెలలపాటు రామచంద్రారెడ్డి ఆ పోస్టులో కొనసాగినా మంత్రి మాత్రం ఎవరి సిఫారసులకూ తలొగ్గకుండా సరెండర్‌కే కట్టుబడ్డారు. చేసేది లేక రెండు నెలల తరువాత రామచంద్రారెడ్డిని రిలీవ్ చేయాల్సి వచ్చింది.
రాజీవ్ విద్యా మిషన్ ఎఫ్‌ఏఓగా మోహనరావు అనే వ్యక్తినినియమించారు. ఈయనను ఎట్టి పరిస్థితుల్లోనూ చేర్చుకోవద్దని, ఆయనను మార్పు చేయిస్తామని మంత్రి కార్యాలయ వర్గాలు ఆర్‌వీఎం అధికారులపై ఒత్తిడి తెచ్చాయి. ఆ పోస్టులో ఓ అనర్హుడిని ఆర్‌వీఎం ఉన్నతాధికారుల ఆదేశాలను కాదని కొనసాగించారు. సుమారు 6 నెలల పాటు మోహనరావుకు బాధ్యతలు అప్పగించకుండా చేశారు. ఆయన బదిలీకి ఎన్ని సిఫారసులు చేసినా ఫలితం లేకపోవడంతో రెండు రోజుల క్రితం శ్రీకాకుళం ఆర్‌వీఎం ఎఫ్‌ఏఓగా మోహనరావుకు బాధ్యతలు అప్పగించారు.
శ్రీకాకుళం జీసీడీఓగా ఓ ప్రధానోపాధ్యాయురాలిని నియమించారు. కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఈ నియామకం జరిగింది. నిబంధనల ప్రకారం రాష్ట్ర అధికారుల రేటిఫికేషన్ కోసం నివేదించారు. ఇది జరిగి ఐదు నెలలు కావస్తున్నా ఇప్పటికీ రాష్ట్ర అధికారుల నుంచి సమాధానం లేదు. జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు ఈ విషయంపై మంత్రి గంటాను ఆశ్రయించి అచ్చెన్నాయుడు సిఫారసులతో జీసీడీఓగా ఆమె చేరారని ఫిర్యాదు చేయడంతో రాష్ట్ర అధికారుల నుంచి ఉత్తర్వులు రాకుండా నిలుపుదల చేయించినట్లు భోగట్టా.
శ్రీకాకుళం విద్యాశాఖాధికారి దేవానందరెడ్డికి కృష్ణా లేని పక్షంలో కర్నూలు జిల్లాకు బదిలీ అవుతుందని మార్చి నెల నుంచి ప్రచారం జరుగుతోంది. కాగా ఆయనకు బదిలీ చేస్తే ఆ స్థానంలో ఓ ఉప విద్యాశాఖాధికారిని నియమించాలని అచ్చెన్న ద్వారా ఓ వర్గం ఓ పేరును ప్రతిపాదించినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. డీఈఓను బదిలీ చేస్తే అచ్చెన్న సిఫారసు చేసిన వ్యక్తికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించాల్సి వస్తుందేమోనని డీఈఓ బదిలీనే నిలుపుదల చేయించినట్లు సమాచారం.
అయితే తప్పనిసరి పరిస్థితుల్లో డీఈఓకు బదిలీ చేయాల్సి వస్తే ఆయనను తూర్పుగోదావరి జిల్లాలో నియమించేలా, ఆయన స్థానంలో సిఫారసులకు అతీతంగా వేరొక రి పేరును చేర్చాలని ఆ మేరకు ఫైలును సిద్ధం చేస్తే తాను విదేశాల నుంచి వచ్చిన తరువాత పరిశీలన చేస్తానని మంత్రి గంటా రాష్ట్ర ఉన్నతాధికారులతో అన్నట్లు తెలియవచ్చింది.
శ్రీకాకుళం విద్యాశాఖాధికారిగా ఇదివరలో ఎస్.అరుణకుమారి పనిచేశారు. ఆమె బదిలీ వెనుక అచ్చెన్న హస్తం ఉందని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. జిల్లా నుంచి రిలీవ్ అయిన అరుణకుమారి పాడేరులో బాధ్యతలు చేపట్టకుండా దీర్ఘకాలిక సెలవుపై ఉండిపోయారు. ఆమెను డీఈఓగా నియమించకుండా చూడాలని అచ్చెన్న వర్గం కృషిచేసింది. అయితే దానికి భిన్నంగా అరుణకుమారిని వారం రోజుల క్రితమే విజయనగరం జిల్లా విద్యాశాఖాధికారిగా నియమించారు. ఇలా అడుగడుగునా అచ్చెన్నకు గంటా చెక్ పెడుతూ వస్తున్నారు.