యనమల అధికార దుర్విని‘యోగం’
-
తమ్ముడి కోసం అడ్డగోలు జీవో
-
ఏకంగా నాలుగు రెట్లు పెంచేసిన అద్దె
-
మరీ అంత ‘పచ్చ’ పాతమా
సాక్షిప్రతినిధి, తుని :
‘వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చుంటే ఏంటీ’అనే సామెతను అక్షరాలా నిజం చేస్తున్నారు ఆర్థిక శాఖామంత్రి యనమల రామకృష్ణుడు. వరుసకు సోదరుడైన కృష్ణుడు కోసం ఏకంగా జీవోనే జారీ చేసి లాభాన్ని సమకూర్చారు మంత్రి వర్యులు. తమ్ముడి కోసం తుని నియోజకవర్గంతో ఉన్న 30 ఏళ్ల రాజకీయ అనుబంధాన్నే వదులుకున్నారాయన. చివరకు కుటుంబ సభ్యులను కూడా కాదని రాజకీయ వారసత్వాన్ని తమ్ముడు చేతుల్లో పెట్టారు. అదంతా వ్యక్తిగతం అనుకున్న నియోజకవర్గ ప్రజలకు తాజాగా తీసుకున్న నిర్ణయం ఆగ్రహం రప్పిస్తోంది. ఇంకా పూర్తికాకుండా నిర్మాణంలో ఉన్న తమ్ముడి భవనంలో తన శాఖకు చెందిన కార్యాలయాన్ని అద్దెకు కేటాయించడం విస్మయం కలిగిస్తోంది. వాణిజ్య పన్నులశాఖ ఆర్థిక మంత్రి యనమల చేతిలో ఉండటంతో ఈ ఆయాచిత లబ్థి చేకూర్చేందుకు తలపడడం అధికార దుర్వినియోగానికి పరాకాకష్టగా నిలుస్తోందరని పలువురు మండిపడుతున్నారు.
తెరదీసింది ఇలా...
వాణిజ్య పన్నులశాఖకు తునిలో సర్కిల్ కార్యాలయం రాణి సుభద్రయ్యమ్మపేటలో ఉంది. గత 30 ఏళ్లుగా కంకిపాటి రాములకు చెందిన భవనంలో ఎనిమిది వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయం నడుస్తోంది. వాణిజ్య పన్నులుశాఖ నెలకు రూ.12,000లు అద్దె చెల్లిస్తోంది. ఆరేళ్ల క్రితమే ఆ భవనాన్ని ఖాళీ చేయాలని భవన యజమాని వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు లేఖలు రాశారు. అధికారులు ఖాళీ చేయకపోవడంతో భవన యజమాని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆ భవనాన్ని ఖాళీచేసి మరో భవనంలోకి మార్పు చేయాలని అధికారులు భావించారు. ఈ విషయం ఆనోటా, ఈనోటా మంత్రి సోదరుడు కృష్ణుడు దృష్టికి వెళ్లడంతో అన్నగారితో మంతనాలు జరిపి తనకు అనుకూలంగా మలుచుకున్నారు.
అద్దెలోనూ హస్తలాఘవాలే...
నిర్మాణం కూడా పూర్తికాని భవనంలో రెండు ఫ్లోర్లకు సంబంధించి 7వేల చదరపు గజాలను కార్యాలయం కోసం అద్దెకు తీసుకోవడానికి జీఓ విడుదల చేయించడంపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. అందుకు నిర్థారించిన అద్దె కూడా ఆషామీషీగా లేదు. తన తమ్ముడే కదా అని యనమల ఉదారంగా ఇప్పుడున్న అద్దెకు నాలుగు రెట్లు ఎక్కువగా నిర్థారించడాన్ని పలువురు ఆక్షేపిస్తున్నారు. రూ.12000లు ఉన్న అద్దెను రూ.50 వేలు పైచిలుకు చెల్లించేలా జీఓ విడుదలవడం విస్మయం కలిగిస్తోంది. ఇప్పుడు కార్యాలయం నడుస్తోన్న భవనంలో 8 వేల చదరపు అడుగులకు నెలకు రూ.12 వేలు అద్దె చెల్లిస్తున్నారు. తాజా భవనంలో 7వేల చదరపు అడుగులకు నెలకు అద్దె రూ.50వేలు పైచిలుకుకు ఖాయం చేశారు. ఇప్పుడున్న స్థలం కంటే ఎక్కువగా విస్తీర్ణం ఉందా అంటే అదీ లేదు. ఈ బహుళ అంతస్తుల భవనం తుని పట్టణం శివారున ఉంది. భవనం నిర్మిస్తున్న ప్రాంతం సగం మున్సిపాలిటీ, సగం ఎస్. అన్నవరం పంచాయితీలో ఉంది. ప్రస్తుత కార్యాలయం నిర్వహిస్తున్న భవనం తుని పట్టణం మ«ధ్యలో అందరికీ అందుబాటులో ఉంది. అధికారుల లెక్కల ప్రకారం ప్రస్తుతం ప్రధాన కూడలిలో ఉన్న భవనాలకు ఎస్‌ఎఫ్‌టీ రూ.6 నుంచి రూ.7లు అద్దె ఉంది. పట్టణానికి శివారులో 1000 ఎస్‌ఎఫ్‌టి ఉన్న ప్లాటుకు రూ.5000 అద్దె పలుకుతోంది. ఈ లెక్కల ప్రకారం చూసినా ఏడు వేల చదరపు అడుగులకు రూ.35 వేలు సరిపోతుంది.
అధికార దుర్వినియోగానికి ఇది పరాకాష్ట
వాణిజ్యపన్నులశాఖ చేతిలో ఉందికదా అని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తన సోదరుడికి ప్రయోజనం చేకూర్చేలా ఉత్తర్వులు జారీ చేయడం అన్యాయం. రూ.12వేలు అద్దె ఉన్న కార్యాలయానికి పెద్దమొత్తంలో పెంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారా? పట్టణ నడిబొడ్డున ఇప్పుడున్న అద్దెకు అనేక బిల్డింగ్‌లు ఇచ్చేందుకు అవకాశం ఉంది. కానీ పట్టణానికి శివారున నిర్మాణం కూడా పూర్తికాకుండానే తమ్ముడు భవనాన్ని అద్దెకు తీసుకోవాలని ఉత్తర్వులు ఇవ్వడం ఎంతవరకు న్యాయం.
దాడిశెట్టి రాజా, ఎమ్మెల్యే, తుని