సాక్షి, నల్లగొండప్రతినిధి : జిల్లాల విభజన ప్రతిపాదన వచ్చినప్పుడు నల్లగొండలోని మిర్యాలగూడ నియోజకవర్గాన్ని సూర్యాపేట జిల్లాలో ప్రతిపాదించారు. సూర్యాపేటలో ఐదు, నల్లగొండలో ఐదు, యాదాద్రిలో రెండు నియోజకవర్గాల చొప్పున ఉంచాలని ప్రభుత్వానికి నివేదించారు. అయితే.. మిర్యాలగూడ ప్రజలు ఈ నిర్ణయంపై తమ అసంతృప్తిని తెలియజేస్తూ పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో తమను నల్లగొండలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొంత ఆలోచన చేసి మిర్యాలగూడను నల్లగొండలోనే ఉంచేలా మరో ప్రతిపాదన తయారుచేశారు. దీనికి తోడు మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరినప్పుడు కూడా సీఎంతో ఈ విషయాన్ని ఖరారు చేసుకున్నారని ప్రచారం జరిగింది. అంతా సజావుగానే ఉంది.. మిర్యాలగూడను నల్లగొండలోనే ఉంచుతున్నారని భావిస్తుండగా ఇటీవల జరిగిన కేబినెట్ సబ్‌కమిటీ సమావేశంలో అధికార పార్టీకి చెందిన జిల్లా నాయకులు మూకుమ్మడిగా (ఎమ్మెల్యే భాస్కరరావు, ఎంపీ గుత్తా మినహా) మిర్యాలగూడ నియోజకవర్గాన్ని సూర్యాపేటలోనే ఉంచాలని చెప్పారు. మిర్యాలగూడను సూర్యాపేటలోనే ఉంచడం వల్ల రాజకీయ, సామాజిక, ఆర్థిక సమీకరణలు సమంగా విభజించినట్టవుతుందని తమ వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఉత్కంఠ పెరిగింది. అఖిలపక్ష సమావేశం, డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లకు గడువు సమీపిస్తున్న కొద్దీ ఈ నియోజకవర్గాన్ని ఏం చే స్తారోననే సస్పెన్స్ అన్ని వర్గాల్లో మొదలైంది. దీంతో కొందరు మళ్లీ పోరుబాట పట్టాలని నిర్ణయించారు. ఈ పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ వద్ద జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో మిర్యాలగూడను నల్లగొండలోనే ఉంచాలని నిర్ణయం తీసుకోగా, ఈ మేరకు అఖిలపక్షం ముందు కూడా ఇదే ప్రతిపాదన ఉంచనున్నారు. అఖిలపక్షం అంగీకరించి , ఇంకెవరూ అభ్యంతరపెట్టకపోతే అదే ఖరారయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
26...19...18
సీఎం ఆమోదించిన డ్రాఫ్ట్ ప్రకారం నల్లగొండ జిల్లాలో 26 మండలాలు ఉండనున్నాయి. నల్లగొండ, దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాలు నల్లగొండలోనే ఉండనున్నాయి. మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్, నకిరేకల్ నియోజకవర్గంలోని రామన్నపేట మండలాలు మాత్రం యాదాద్రి జిల్లాకు వెళ్తాయి. ఇక.. నాలుగు నియోజకవర్గాలతోనే సూర్యాపేట ఏర్పాటు కానుంది. సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, తుంగతుర్తి నియోజకవర్గాలతో ఈ జిల్లా ఏర్పాటు కానుండగా.. తుంగతుర్తిలోని మోత్కూరు మండలాన్ని యాదాద్రి జిల్లాతో కలపనున్నారు. దీంతో సూర్యాపేట జిల్లాలో కేవలం 19 మండలాలే ఉన్నాయి. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలతో ఏర్పాటు కానున్న యాదాద్రి జిల్లాలో రామన్నపేట, మోత్కూరు, చౌటుప్పల్‌తో పాటు వరంగల్ జిల్లా నుంచి లింగాల ఘనపురం, బచ్చన్నపేట, దేవరుప్పల, జనగామ మండలాలు కలిపి మొత్తం 18 మండలాలను ఏర్పాటు చేయనున్నారు. విస్తీర్ణం విషయానికి వస్తే నల్లగొండ జిల్లా చాలా పెద్ద జిల్లాగా ఉండనుంది. 7217.72 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మొత్తం రాష్ట్రంలో ఏర్పాటు కానున్న 27 జిల్లాల్లోనే రెండో పెద్ద జిల్లాగా నల్లగొండ మారనుంది. నల్లగొండ కన్నా ఆదిలాబాద్ నుంచి ఏర్పాటవుతున్న కొమురంభీం జిల్లా పెద్దది. జనాభా విషయంలోనూ నల్లగొండ నాలుగో స్థానంలో ఉంటోంది. రంగారెడ్డి (అర్బన్), మల్కాజ్‌గిరి, హైదరాబాద్ తర్వాత నల్లగొండలోనే ఎక్కువ జనాభా ఉంటోంది. మండలాల విషయానికి వస్తే నల్లగొండలో ఉన్నన్ని మండలాలు ఏ జిల్లాలో లేవు. 26 మండలాలతో అతిపెద్ద జిల్లాగా నల్లగొండ రూపుదిద్దుకోనుంది.
నీలగిరిలోనే మిర్యాల !
Published Fri, Aug 19 2016 1:42 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
Advertisement