ప్రజల పక్షాన ప్రశ్నిస్తే నోరు నొక్కేస్తారా?
ప్రజల పక్షాన ప్రశ్నిస్తే నోరు నొక్కేస్తారా?
Published Wed, Jan 11 2017 11:53 PM | Last Updated on Thu, Sep 13 2018 5:22 PM
జన్మభూమి సభలో అధికార పక్షాన్ని నిలదీసిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి
తెలుగుదేశం నేతల తీరుకు నిరసనగా సభ నుంచి వాకౌట్
కొత్తపేట : ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ప్రజా సంక్షేమ పథకాల అమలుపై ప్రజల పక్షాన అధికారులను ప్రశ్నిస్తే మా నోరు నొక్కేస్తారా? ఇది ప్రజల సభా.. లేక తెలుగుదేశం పార్టీ సభా? ఏమిటీ వివక్ష? ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వరు.. కనీసం మాట్లాడే హక్కు కూడా లేదా? ఇది ప్రజాస్వామ్యమేనా? లేక నియంతృత్వ పాలనా? అర్ధం కావడంలేదు.అంటూ కొత్తపేట జన్మభూమి గ్రామసభలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.బుధవారం స్థానిక గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ మిద్దే అనూరాధ అధ్యక్షతన జరిగిన గ్రామసభ వేదికపై స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, మండల టీడీపీ అధ్యక్షుడు కంఠంశెట్టి శ్రీనివాసరావు తదితర టీడీపీ నాయకులు ఆశీనులై వున్నారు. అనంతరం ఎమ్మెల్యే జగ్గిరెడ్డి హాజరు కాగా ఆయనను సర్పంచ్ ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. ఆయన వేదికను పరిశీలించి వైఎస్సార్‌సీపీ నాయకులను కూడా ఆహ్వానించాలని జగ్గిరెడ్డి సూచించారు. దానికి జెడ్పీటీసీ సభ్యుడు దర్నాల రామకృష్ణ అభ్యంతరం చెప్పడంతో మీరు ప్రొటోకాల్ ప్రకారమే పిలిచారా? అయితే నేనూ కిందే కూర్చుంటాను అంటూ జగ్గిరెడ్డి వేదిక నుంచి దిగి ప్రజల మధ్య కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేష¯ŒS కార్డులు,పక్కా గృహాలు, పింఛన్ల మంజూరుపై ఆయా శాఖల అధికారులను నిలదీశారు. మాట్లాడితే రూ 16 వేల కోట్ల లోటు బడ్జెట్ అంటారు. సీఎం ఇల్లు వాస్తు మార్పునకు రూ.100 కోట్లు ఖర్చు చేయడం అవసరమా? అని ప్రశ్నించారు.కేంద్ర ప్రభుత్వం పార్టీ రహితంగా ప్రతి ఎంపీకి ఏడాదికి రూ.5 కోట్లు, పక్క తెలంగాణా ప్రభుత్వం ప్రతీ ఎమ్మెల్యేకు రూ.3 కోట్లు ఇస్తుండగా ఇక్కడ ఏపీలో మాత్రం ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సంతలో గేదెలను కొన్నట్టు కొంటున్నారని, వారి ప్రలోభాలకు లొంగని ఎమ్మెల్యేలపై ఓడిపోయిన నాయకులకు నిధులు ఇస్తున్నారని విమర్శించారు. నైతిక విలువలు వున్న వాడిని కాబట్టే మీ అధికారానికి నేను అమ్ముడుపోలేదన్నారు. అడక్కుండా ఉండడం వల్లే ఇక్కడ మీ ఆటలు సాగుతున్నాయన్నారు. ప్రజా తీర్పును గుర్తెరిగి ఎవరి స్థానం ఎక్కడో గ్రహించాలని హితవు పలికారు. అధికార మదంతో వ్యవహరిస్తున్నారనడంతో పలు మార్లు మైక్ కట్ చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మాట్లాడుతుంటే మైక్ కట్ చేయడం మీ సాంప్రదాయమా అని, భవిష్యత్‌లో ప్రజలే గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. దానిపై దర్నాల రామకృష్ణ సహా టీడీపీ నాయకులు ఎమ్మెల్యే చిర్ల ప్రసంగానికి అడ్డుతగలడంతో వైఎస్సార్‌సీపీ నాయకులు వేదిక వద్దకు వచ్చారు. దానితో ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం, తోపులాటతో రసాభాసగా మారింది. రావులపాలెం సీఐ పీవీ రమణ ఆధ్వర్యంలో అప్పటికే మోహరించిన పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను విడదీశారు. టీడీపీ నాయకుల తీరును నిరసిస్తూ జగ్గిరెడ్డి సభను బహిష్కరించి బయటకు వచ్చేశారు. అనంతరం జగ్గిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ గతంలో నీరు–చెట్టు పథకం కింద తీసిన మట్టిని తమ సొంత స్థలాలకు ఉపయోగించుకున్నారని, అలాగే అధికారాన్ని అడ్డం పెట్టుకుని పాల్పడుతున్న అవినీతిని ప్రశ్నిస్తానని మైక్ ఆఫ్ చేసి నోరు నొక్కే చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
Advertisement
Advertisement