విజయం.. ఈ మూడక్షరాల లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎంతో శ్రమించాలి. తీవ్రంగా కష్టపడాలి. విలువైన సమయాన్ని వెచ్చించాలి. ఒక్కోసారి జీవితాంతం పోరాడాలి. ఇంత చేసినా విజయం వరిస్తుందనే భరోసా లేదు. ఇటువంటి కోవకే చెందిన పలువురు నేతలు మన జిల్లాలో ఉన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవలో తరలించాలనేది వారి జీవితాశయం. ఇందుకు కోసం పలుమార్లు అభ్యర్థులు పోటీ చేసినా విజయం వరించలేదు. పార్టీలు మారినా వారి తలరాత మారలేదు. ఏకంగా మూడు, నాలుగుసార్లు ప్రయత్నించి ఓటమిపాలైన వారిలో కొందరు నేతల వివరాలు ఇవీ..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల, పరిగి అసెంబ్లీ నుంచి అనంతరెడ్డి మూడుసార్లు పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నా ఫలితం లేకపోయింది. ఈ మూడుసార్లు కూడా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగినా.. గెలుపు ముగింట బోర్లాపడ్డారు. 1972 ఎన్నికల్లో చేవెళ్ల, పరిగి నుంచి బరిలోకి దిగారు. అక్కడా.. ఇక్కడా కాంగ్రెస్ అభ్యర్థులైన పి.కిషన్‌రావు, కమతం రామిరెడ్డి చేతుల్లో పరాజయం పాలయ్యారు. ఇక 1983 ఎన్నికల్లో మరోసారి పోటీ చేశారు. ఈ సారి పరిగి నియోజకవర్గం నుంచి పోటీచేసి మూడోస్థానానికి పరిమితమయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవ చేయాలనుకున్న ఆయన.. మూడుసార్లు సర్వశక్తిలొడ్డినా విజయం వెక్కిరించింది.
దేవదాసుకు విజయం దూరం..
పార్టీలు మారినా దేవదాసుకు కాలం కలిసిరాలేదు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగుసార్లు పోటీ చేసినా గెలుపును అందుకోలేకపోయారు. పట్టు వదలని విక్రమార్కుడిలా చివరి వరకు పోరాడినా.. విజయం ఊరించిందే తప్పా చేతికి అందలేదు. వికారాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఆయన తొలిసారిగా 1967 ఎన్నికల్లో పోటీ చేశారు. కాంగ్రెస్ నేత అరిగె రామిస్వామి చేతిలో పరాభవం పొందారు. ఆ తర్వాత వరుసగా 1978, 1983, 1985 ఎన్నికల్లో బరిలోకి దిగినా ఫలితంలో మార్పులేదు.
1978లో జనతా పార్టీ నుంచి పోటీ చేయగా, ఇందిర కాంగ్రెస్ అభ్యర్థి వీబీ తిరుమలయ్య చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ వెంటనే పార్టీని వీడిన దాసు.. తదుపరి రెండు ఎన్నికల్లోనూ తిరిగి స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేసినా రెండో స్థానానికే పరిమితమయ్యారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఓటమిలో హ్యాట్రిక్ సాధించిన వ్యక్తుల్లో ఈయన రెండోవ్యక్తి.
దేవరాజ్ మరో హ్యాట్రిక్..
హ్యాట్రిక్ ఓటమి నమోదు చేసిన ఇద్దరు వ్యక్తుల్లో ఏఆర్ దేవరాజ్ ఒకరు. వికారాబాద్ నుంచి పోటీ చేసిన మూడుసార్లు కూడా పరాభవం చెందారు. 1972 ఎన్నికల్లో సీపీఐ తరఫున బరిలోకి దిగిన దేవరాజ్.. మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. 1978లో ఇదే అనుభవం పునరావృతమైంది. ఇక 1983లో 7.35 శాతం ఓట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచారు.
బీఎస్.. ముచ్చటగా మూడుసార్లు
జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు ముందు వరకు మహబూబ్‌నగర్ జిల్లాలో అసెంబ్లీ సెగ్మెంట్‌గా ఉన్న కల్వకుర్తి స్థానానికి బి.సత్యనారాయణ రెడ్డి (బీఎస్) మూడుసార్లు పోటీ చేసి ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. రెండుసార్లు సమీప ప్రత్యర్థులకు పోటీ ఇచ్చినా, పార్టీ మారినా.. విజయం వెక్కిరించింది.
1967 ఎన్నికల్లో సంయుక్త సోషలిస్ట్ పార్టీ (ఎస్‌ఎస్‌పీ) నుంచి బరిలోకి దిగిన ఈయన.. మూడో స్థానానికి పరిమితమయ్యారు. 1969 ఉప ఎన్నిక, 1972 సాధారణ ఎన్నికల్లో ఎస్‌ఎస్‌పీ, ఎస్‌టీఎస్ పార్టీల తరఫున పోటీ చేశారు. ఈ రెండు సార్లు కూడా కాంగ్రెస్ అభ్యర్థి సూదిని జైపాల్‌రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు.
సదాలక్ష్మికి దక్కని గెలుపు
వికారాబాద్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు పోటీచేసిన టీఎన్ సదాలక్ష్మి ఓటమి పాలయ్యారు. తొలిసారిగా 1972 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగిన ఆమె.. స్వతంత్ర అభ్యర్థి వీబీ తిరుమలయ్యకు గట్టి పోటీనిచ్చారు. చివరకు సుమారు 4,700 ఓట్ల మెజారిటీతో తిరుమలయ్య విజయం సాధించారు. ఆ తర్వాత 1983లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగినా.. గెలుపును అందుకోలేకపోయారు. ఈ ఎన్నికల్లో మూడోస్థానంతో సరిపెట్టుకున్నారు.
ఒకరి చేతిలో రెండుసార్లు
తాండూరు నుంచి సిరిగిరిపేట్ సాయిరెడ్డి పోటీ చేసిన రెండుసార్లు ఓడిపోయారు. 1978లో జనతా పార్టీ తరఫున బరిలోకి దిగిన సాయిరెడ్డి.. ఇందిర కాంగ్రెస్ అభ్యర్థి ఎం.మాణిక్ రావు చేతిలో ఓడిపో
యారు. ఆ తర్వాత 1983 ఎన్నికల్లోనూ ఇదే ఫలితం పునరావృతమైంది. అయితే, సాయిరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు.
సిద్రప్పకు అందని ద్రాక్షే..
సంయుక్త సోషలిస్ట్ పార్టీ (ఎస్‌ఎస్‌పీ) నేత సిద్రప్పకు కూడా రెండుసార్లు పరాభవం ఎదురైంది. తాండూరు నుంచి 1952, 1967 ఎన్నికల్లో పోటీ చేసిన ఈయనకు గెలుపు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.
లక్ష్మారెడ్డికి చేదు అనుభవం
షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి ఎల్.లక్ష్మారెడ్డి కూడా రెండుసార్లు చేదు అనుభవం ఎదురైంది. 1952 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఈయన.. కాంగ్రెస్ నేత బూర్గుల రామకృష్ణారావు చేతిలో ఓటిమి పాలయ్యారు. ఆ తర్వాత 1957 ఎన్నికల్లో ఈయనపై కాంగ్రెస్ అభ్యర్థి షాజహాన్ బేగం విజయం సాధించారు. ఈ రెండు ఎన్నికల్లో సమీప ప్రత్యర్థి లక్ష్మారెడ్డినే కావడం గమనార్హం.
జెండా మార్చినా..
పార్టీలు మారినా బి.మధురవేణిని విజయం వరించలేదు. వికారాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌కి 1999 ఎన్నికల్లో తొలుత కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగారు. రెండోస్థానానికి పరిమితమైన ఈమె.. టీడీపీ అభ్యర్థి ఏ.చంద్రశేఖర్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత పార్టీని మారిన మధురవేణి.. 2004 ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలో దిగారు. ఈసారి కూడా చంద్రశేఖర్‌దే గెలుపు.
గట్టి పోటీనిచ్చినా..
కొడంగల్ నుంచి రెండుసార్లు బరిలోకి దిగిన ఆర్. చినవీరన్నకు విజయం అందలేదు. 1972లో కాంగ్రెస్ తరఫున పోటీ చేయగా.. మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి ఎన్.వెంకటయ్య గెలుపొందారు. 1978 ఎన్నికల్లో ఇందిర కాంగ్రెస్ పక్షాన బరిలో దిగగా.. ఇండిపెండెంట్ అభ్యర్థి గురునాథరెడ్డికి గట్టి పోటీనిచ్చారు. చివరకు వీరన్నకు ఓటమి తప్పలేదు.
Comments
Please login to add a commentAdd a comment