
అజ్ఞాతంలో ఎమ్మెల్యే జేసీ..!
తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తన అనుచరులకు గన్‌మెన్లను కేటాయించాలని ఇటీవల ఆయన లేఖలు రాయడంతో, రాష్ట్ర ప్రభుత్వం పెయిడ్ గన్‌మెన్లను కేటాయించింది. దీంతో మనస్తాపం చెందిన ఆయన తన గన్‌మెన్లతోపాటు అనుచరులకు కేటాయించిన గన్‌మెన్లను సైతం ఐదు రోజుల కిందట వెనక్కి పంపేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన చెప్పాపెట్టకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సెల్‌ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేశారు.
పోలీసులు తాను చెప్పినట్లు వినడం లేదని, కనీసం తాను సూచించిన వారిని కూడా ఎస్పీ నియమించడం లేదనే అక్కసుతోనే గన్‌మెన్ల ఉదంతాన్ని ఆయన తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. అనంతపురం పాత ఊరు రోడ్డు విస్తరణ అంశం అక్కడి ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మధ్య మనస్పర్ధలు పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎంపీ సోదరుడు ఇలా అజ్ఞాతంలోకి వెళ్లడాన్ని బట్టి చూస్తే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేందుకు జేసీ సోదరులిద్దరూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.