ఫ్యాక్టరీ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న మంత్రులు, స్పీకర్, ఎంపీ, ఎమ్మెల్యే
అప్పారావుపేట (దమ్మపేట): అప్పారావుపేటలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మంగళవారం పరిశీలించారు. ఈ ఫ్యాక్టరీ అవసరాన్ని తోటి మంత్రులకు, స్పీకర్‌కు తుమ్మల వివరించారు. దమ్మపేట మండలంలోని దాదాపు 15వేల ఎకరాల్లో పామాయిల్ పంట సాగవుతోందని వారితో చెప్పారు. అప్పారావుపేటలో నూతన పరిజ్ఞానంతో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నట్టు మంత్రులతో ఆయిల్‌ఫెడ్ ఎండీ మురళి చెప్పారు. ఈ ఫ్యాక్టరీ పూర్తయితే ఆయిల్ రికవరీ శాతంతోపాటు రైతుల పంటలకు ధర పెరుగుతుందని చెప్పారు. నూతన సాంకేతిక పరిజ్ఙానంలో భాగంగా ముందుగా ఇక్కడ గంటకు 30 టన్నుల పామాయిల్ గెలలు క్రషింగ్ అయ్యేలా మినషరీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. తర్వాత పంట దిగుబడుల ఆధారంగా గంటకు 60 టన్నులు క్రషింగ్ అయ్యేలా మిషనరీని ఏర్పాటు చేస్తామన్నారు.