
అదిగదిగో గులాబి చంద్రుడు
ఎప్పుడూ తెలుపు రంగులో కనిపించే చందమామ గురువారం గులాబీ రంగులో దర్శనమివ్వనున్నాడు.
నేడు గులాబి రంగులో దర్శనం
అరుదుగా కనిపించే ఈ దృశ్యం ఎంతో శుభకరం అంటున్న పండితులు
ఏ పుణ్యకార్యం చేసినా వెయ్యిరెట్ల ఫలం
మహానంది: ఎప్పుడూ తెలుపు రంగులో కనిపించే చందమామ గురువారం గులాబీ రంగులో దర్శనమివ్వనున్నాడు. అరుదుగా కనిపించే చంద్ర దర్శనాల్లో ఇదొకటిగా ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ దృశ్యం 21 గురువారం రాత్రి 10.54 నిమిషాల నుంచి 22వ తేదీ శుక్రవారం వేకువజాము 3.42 నిమిషాల వరకు ఉంటుందని కంచి పీఠ ఆస్థాన సిద్ధాంతి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆగమ సలహాదారులు జ్యోతిష్య కేసరి బ్రహ్మశ్రీ దైవజ్ఞ సుబ్రమణ్య సిద్ధాంతి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన బుధవారం సాక్షితో మాట్లాడారు. గతంలో చంద్రుడు నీలం, బంగారు వర్ణాల్లో కనిపించిన విషయం తెలిసిందే. అందులో గులాబీ రంగులో దర్శనానికి ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. సూర్యుడు 0 డిగ్రీల నుంచి 15 డిగ్రీల లోపు మేషరాశిలో అశ్వని నక్షత్రం సంచారం జరుగుతున్న సమయంలో వ్యతిరేక దిశలో 180 డిగ్రీల కోణంలో చంద్రుడు ఉన్నప్పుడు ఇలా కనిపిస్తుందన్నారు. 2009 ఏప్రిల్, 2012 ఏప్రిల్ 6,7న, 2014 ఏప్రిల్ 15, 16న ఇలా కనిపించిదని చెప్పారు. ఈ సమయంలో ఏ చిన్న పుణ్యకార్యం చేసినా వెయ్యిరెట్ల పుణ్యఫలం లభిస్తుందని చెప్పారు.