ఇద్దరు చిన్నారులతో కాలువలోకి దూకిన తల్లి
ఇద్దరు చిన్నారులతో కాలువలోకి దూకిన తల్లి
Published Tue, Apr 11 2017 11:27 PM | Last Updated on Tue, Sep 5 2017 8:32 AM
తల్లి, పెద్ద కుమారుడిని రక్షించిన కల్లుగీత కార్మికుడు
గల్లంతైన చిన్న కుమారుడు
అనపర్తి : ఆ తల్లికి ఏ కష్టమొచ్చిందో ఏమో తనువు చాలించాలని ఇద్దరు చిన్నారులతో కాలువలోకి దూకింది. ఇటీవల కొత్తపేట సమీపంలో కాలువలో దూకి అక్కాచెల్లెళ్లు బిడ్డలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ముగ్గురు పిల్లలు, తల్లి మృతి చెందిన ఘటన మరువక ముందే అనపర్తిలో మరో ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు, భర్తతో తగాదాతోనే తన ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. తల్లిని, పెద్ద కుమారుడిని కల్లుగీత కార్మికుడు రక్షించగా, చిన్న కుమారుడు కాలువలో పడి గల్లంతయ్యాడు. బాధితుల బంధువులు, స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. అనపర్తి గంగన్నగారి వీధికి చెందిన తంగేటి లోవకుమారి, శివగణేష్‌లు అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరికి ఐదేళ్ల రోహిత్ వీరేంద్రనా«థ్, మూడేళ్ల కుష్యంతరాజు అనే కుమారులు ఉన్నారు. ఆరేళ్లుగా ద్వారపూడిలో నివాసం ఉన్న శివగణేష్ కుటుంబం ఏడాది క్రితం అనపర్తికి వచ్చింది. శివగణేష్ స్థానికంగా ఉన్న పెట్రోల్ బంక్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో ఈ కుటుంబం ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భార్యాభర్తల మధ్య ఇటీవల తగాదాలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ నెల 10న లోవకుమారి, శివగణేష్‌ల మధ్య ఏర్పడిన చిన్న తగాదా ఈమెను ఆత్మహత్యాయత్నానికి ప్రేరేపించినట్టు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో తన ఇద్దరు కుమారులను తీసుకుని లోవకుమారి కెనాల్ రోడ్డులోని వీర్రాజు మామిడి వద్దకు చేరుకుంది. తొలుత చిన్నారులను కాలువలోకి విసిరేసి తాను కూడా దూకింది. ఈ తతంగాన్ని సమీపంలో కల్లు అమ్ముకుంటున్న గీత కార్మికుడు గమనించాడు. పరుగున వచ్చి తొలుత లోవకుమారిని, అనంతరం పెద్ద కుమారుడు రోహిత్ వీరేంద్రనాథ్‌ను ఒడ్డుకు చేర్చాడు. చిన్న కుమారుడిని రక్షించే ప్రయత్నం చేసినా అప్పటికే కుష్యంత్‌రాజు గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున కాలువ వద్దకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు లోవకుమారిని, పెద్ద కుమారుడిని స్టేషన్‌కు తీసుకు వచ్చిన అనంతరం వైద్య పరీక్షల కోసం స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. సమాచారం అందుకున్న శివగణేష్ పోలీస్టేషన్‌కు చేరుకుని బోరున విలపించాడు. ఆత్మహత్య చేసుకునేంత పెద్ద పాటి తగాదాలు లేవని, ఆర్థిక సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని తెలిపాడు. అనపర్తి అడిషనల్ ఎస్సై రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బాలుడి ఆచూకీ కోసం..
కుష్యంత్‌రాజు ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ధవళేశ్వరం నుంచి గజ ఈతగాళ్లను రప్పించి వారి సాయంతో బాలుడి ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. గత నెలలో హోలీ రోజున ఇద్దరు బాలురు నల్లకాలువలో పడి మృతి చెందిన ఘటనను అనపర్తి ప్రజలు మరువక ముందే కుష్యంత్‌రాజు ఈ రూపంలో గల్లంతవ్వడం స్థానికంగా పలువురిని కలవరపరుస్తోంది.
Advertisement
Advertisement