సా..గుతున్న ‘ముచ్చుమర్రి ’
ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి. మంత్రులు, జిల్లా అధికారులు చేస్తున్న ప్రకటనలకు జరుగుతున్న పనులకు చాలా వ్యత్యాసం ఉంది. నవంబర్‌లో మూడు పంపులతో ట్రయల్‌రన్, డిసెంబర్‌లో ప్రాజెక్టును జాతికి అంకితం ప్రకటన గడువులోపు నెరవేరేలా కనిపించడం లేదు. ఇప్పటి వరకు పంపుల అమరిక, అప్రోచ్ చానల్ కాలువ పనులు కూడా పూర్తికాలేదు
పగిడ్యాల: శ్రీశైలం బ్యాక్‌వాటర్ నికర జలాలను వినియోగంలోకి తీసుకోరావడానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే, ఆయన అకాల మరణంతో పనులు ముందుకు సాగడం లేదు. 16 పంప్‌ల సామర్థ్యంతో ప్రారంభమైన ఎత్తిపోతల పనులో్ల ప్రస్తుతం 8 పంప్‌లకు సంబంధించిన అర్త్ వర్క్ పనులు తుది దశకు చేరుకోగా మరో నాలుగు పంప్‌ల పనులు అసంపూర్తిగా శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో ముంపునకు గురయ్యాయి. ప్రాజెక్ట్ పనుల పురోభివృద్ధిని పరిశీలించేందుకు వచ్చిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి గత ఆగష్టు 15 నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని అధికారిక ప్రకటన చేశారు. తర్వాత జిల్లా కలెక్టర్ గత నెలలో ముచ్చుమర్రి ఎత్తిపోతల పనులను పరిశీలించి నవంబర్ పదిహేను నాటికి కేసీ కాలువకు మూడు పంపుల ద్వారా ట్రయల్‌రన్ నిర్వహిస్తామని డెడ్‌లైన్ విధించారు. అంతేకాదు హంద్రీనీవా సుజల స్రవంతి కాలువకు డిసెంబర్ పదిహేను నాటికి 8 పంప్‌లతో నీటిని సరఫరా చేసి ప్రాజెక్ట్‌ను జాతీకి అంకితమివ్వాలని కాంట్రాక్టర్‌లకు, పర్యవేక్షక నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చి వెళ్లారు. అయితే, ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న పనులను పరిశీలిస్తే ప్రాజెకు్ట పూర్తిస్థాయిలో రూపుదిద్దుకోవాలంటే మరో ఏడాదికి పైగా పడుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పనుల్లో కనిపించని పురోగతి
ముచ్చుమర్రి పంప్‌హౌస్ నుంచి సిద్ధేశ్వరం వరకు 6 కిలో మీటర్ల పొడువు ఉండే అప్రోచ్ చానెల్ కాలువ పనులు పూర్తి కాలేదు. 2 కిలోమీటర్ల పనులు బ్యాక్‌వాటర్‌లో మిగిలిపోయాయి. ప్రస్తుతం పంప్‌హౌస్ వద్ద పంప్‌ల అమరిక పనులు, 220/33 కేవీ సబ్‌స్టేషేన్ పనులు మాత్రమే కొనసాగుతున్నాయి. నవంబర్‌లో కేసీ కాలువకు నీటిని పంపింగ్ చేసేందుకు కనీసం నాలుగు పంప్‌ల అమరిక కూడా పూర్తి కాలేదు. మూడు పంప్‌లను కూర్చోబెట్టేందుకు అన్ని సిద్ధం చేశామని క్రేయిన్ ద్వారా పంప్‌లను దింపుతామని సైట్ మేనేజర్ కలెక్టర్‌కు భరోసా ఇచ్చారు. అయితే పని ప్రదేశంలో రెండు పంప్‌లకు సంబంధించిన పరికరాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని ఇంకా మోటర్లు రాలేదని విశ్వసనీయ సమాచారం.
తాత్కాలిక సబ్‌స్టేషన్ పనుల్లో నాణ్యత కరువు:
కొణిదేల 11/33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి ముచ్చుమర్రి పంప్‌హౌస్ వరకు పంట పొలాల మధ్య స్తంభాల ఏర్పాటులో నాణ్యత పాటించడం లేదని తెలుస్తోంది. స్తంభం నాటిన గుంతలో సిమెంట్ మిశ్రమంతో కూడిన కంకర బెడ్ వేయకుండా మట్టితోనే సరిపెడుతున్నారు. భవిష్యత్‌లో గాలివానకు ఈ విద్యుత్ స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉందని రైతులు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు.
కేసీకి నీరు కలే : శ్రీనివాసులు, సర్పంచ్, పాతముచ్చుమర్రి
ఈ ఏడాది కేసీ ఆయకట్టు రైతుల పరిస్థితి దారుణంగా ఉంటుంది. నవంబర్ పదిహేనుకు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి మూడు పంప్‌ల ద్వారా ట్రయల్ రన్ నిర్వహిస్తామని కలెక్టర్ చెప్పారు. ప్రాజెక్టు దగ్గర చూస్తే పనులు ముందుకు సాగడం లేదు. మరో ఏడాది పట్టే అవకాశం ఉంది.
రైతులను మోసం చేస్తున్నారు: పుల్యాల నాగిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు.
పగిడ్యాల వచ్చేనెలలో కేసీ కాలువకు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి నీటి విడుదల కష్టమే. ఎందుకో మరి అధికారులు అసత్యప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతానికి తుంగభద్ర నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలి.
మా ప్రయత్నం మేము చేస్తున్నాం: రెడ్డిశేఖర్‌రెడ్డి, ఈఈ:
కలెక్టర్ ఆదేశాలు మేరకు పనులు పూర్తి చేసేందుకు శ్రమిస్తున్నాం. బిల్డింగ్ కట్టుకోవాలంటేనే దాదాపు ఏడాది కాలం పడుతోంది. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ను ఏడాదికే పూర్తి చేయాలంటే ఎలా సాధ్యం. ఇంకా డెలివరీ పనులు జరగాలి, దేని సమస్యలు దానికి ఉన్నాయి.