రాజమహేంద్రవరం : కాపు రిజర్వేషన్ల ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆమరణ దీక్ష శుక్రవారం నాటికి తొమ్మిదో రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకూ ఆయన ఎలా ఉన్నారో వె ద్యులు చెబితే గాని ప్రజలకు తెలియని పరిస్థితి. ప్రభుత్వం ఎలా చెప్పమంటే వైద్యులు అలాగే చెబుతారన్న విషయంలో ఎలాంటి అనుమానం లేదు. ముద్రగడను తమకు చూపించాలని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోకుండా ప్రభుత్వం ఆయనను ఒక ఉగ్రవాదిలా చూస్తోందని ప్రజలు మండిపడుతున్నారు. మొదటి రోజు మీడియాలో వచ్చిన చిత్రాలు, వీడియోలు తప్ప ఇప్పటి వరకు ముద్రగడ ఎలా ఉన్నారో ప్రజలతోపాటు మీడియాకూ తెలియని పరిస్థితి.
ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో విలేకరులు ఆస్పత్రిలోకి వెళ్లలేని స్థితి. ఆస్పత్రి ప్రధానద్వారం వద్ద రెండు వరుసల్లో బారికేడ్లు పెట్టి డీఎస్పీ నేతృత్వంలో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు.ఈ నెల 9న సాయంత్రం ముద్రగడను పోలీసులు ఆస్పత్రికి తీసికెళ్లారు. అప్పటి నుంచి ఆస్పత్రి ఎదురుగా వై జంక్షన్ నుంచి సీటీఆర్‌ఐ జంక్షన్ వరకూ రెండు కిలోమీటర్ల మేర ఉన్న 100 అడుగుల రహదారిని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రతి 400 మీటర్లకు ఒకటి చొప్పున బారికేడ్లు పెట్టారు. ప్రతిచోటా ఓ ఎస్సైని, 10 మంది సిబ్బందిని కాపలాగా నియమించారు. ఆ రోడ్డులోకి ఎవరూ రాకుండా ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు. రోగులను తప్ప ఎవ్వరినీ అనుమతించడంలేదు. విలేకరులనూ గుర్తింపు కార్డులు చూపించిన తర్వాతే అనుమతిస్తున్నారు.
పేదలకు వైద్యం దూరం, భారం
రాజమహేంద్రవరం జిల్లా ఆస్పత్రికి ఉభయగోదావరి జిల్లాల నుంచి ప్రతి రోజూ సుమారు 1000 మంది రోగులు వస్తారు. పరీక్షలు చేయించుకునేందుకు వచ్చే గర్భిణులు 200 మంది ఉంటారు. ప్రతిరోజు 20 కాన్పులు జరుగుతుంటాయి. పోలీసు ఆంక్షలతో వీరందరూ రెండు కిలోమీటర్లు నడిచి రావాల్సి వస్తోంది. బాలింతలు, పసిబిడ్డలతో నడవలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎండ ధాటికి కొంత మంది రోగులు నడవలేక సొమ్మసిల్లి పడిపోతున్నారు. ఈ నేపథ్యంలో వారం రోజుల నుంచి రోగుల సంఖ్య బాగా తగ్గింది. గత నాలుగు రోజుల నుంచి పోలీసులు ఉచిత ఆటోలు ఏర్పాటు చేసినా రోగుల సంఖ్య పెరగలేదు.
బందోబస్తు వల్లే రోగుల సంఖ్య తగ్గిందని ఆస్పత్రి వైద్యులు కూడా పేర్కొనడం గమనార్హం. సమీపంలో దుకాణాలు మూసివేయడం, రవాణా సదుపాయం లేకపోవడంతో ఆస్పతిలో ఉన్న రోగులకు సకాలంలో భోజనం, పాలు తీసుకు వచ్చేందుకు వారి బంధువులు పడరానిపాట్లు పడుతున్నారు. పోలీసుల ఆంక్షలతో ఆస్పత్రి పరిసర ప్రాంతాల ప్రజల ఇబ్బందులు తీవ్రమయ్యాయి. ప్రతి బారికేడ్ దగ్గర తాము ఇక్కడి ప్రాంతవారమేనని రుజువు చేసుకుంటే తప్ప ఇళ్లకు వెళ్లలేకపోతున్నారు. లాలా చెరువు వైపు వెళ్లేవారు వై జంక్షన్ నుంచి సీటీఆర్‌ఐ జంక్షన్ వరకు వెళ్లాంలటే రెండు కిలోమీటర్ల బదులు ఐదు కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి.
చిరువ్యాపారుల విలవిల..
వై జంక్షన్ దాటిన తర్వాత ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా రైతు బజారు ఉంది. ఇక్కడ 30 దుకాణాలున్నాయి. ఒక్కో దుకాణదారూ రోజుకు 6 క్వింటాళ్ల కూరగాయలు విక్రయిస్తుంటారు. అయితే తొమ్మిది రోజులుగా విక్రయాలు రెండు క్వింటాళ్లకు పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయలు చెడిపోవడంతో రోజుకు రూ.3,000 నష్టం వస్తోందని వాపోతున్నారు. ఈ రోడ్డు ఉన్న బడ్డీకొట్ల వారు, సైకిల్ మెకానిక్‌లు, ఇతరత్రా ఉపాధి పొందే చిరుజీవులూ ఉపాధి కోల్పోయారు. రెండు వరుసల రోడ్లలో ఒక వైపు రాకపోకలకు అనుమతించాలని వారు కోరుతున్నారు.
అష్టదిగ్బంధనంలో ముద్రగడ
Published Fri, Jun 17 2016 6:16 PM | Last Updated on Mon, Sep 4 2017 2:44 AM
Advertisement
Advertisement