ముహూర్తం ఖరారు
-
దసరా రోజు నుంచి కొత్త జిల్లాలు
-
ప్రముఖుల చేతుల మీదుగా కార్యక్రమాలు
-
భూపాలపల్లి : శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి
-
జనగామ : శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్
-
వరంగల్ రూరల్ : ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
-
మహబూబాబాద్ మంత్రి అజ్మీరా చందూలాల్
సాక్షిప్రతినిధి, వరంగల్ : పరిపాలన వికేంద్రీకరణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన ముహూర్తం ఖరారైంది. దసరా రోజున కొత్త జిల్లాల ఏర్పాటు కార్యక్రమం ఘనంగా జరగనుంది. కొత్త జిల్లాలను ప్రారంభించే ప్రజాప్రతినిధుల పేర్లను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్నత పదవుల్లో ఉన్న కీలక నేతలు కొత్త జిల్లాలను ప్రారంభించనున్నారు. శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి జయశంకర్(భూపాలపల్లి) జిల్లాను ప్రారంభిస్తారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ జనగామ జిల్లా ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వరంగల్ రూరల్ జిల్లాను ప్రారంభిస్తారు. గిరిజన సంక్షేమ మంత్రి అజ్మీరా చందులాల్ మహబూబాబాద్ జిల్లా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రస్తుతం ఉన్న వరంగల్ జిల్లాలో ఎలాంటి కార్యక్రమాలూ ఉండవు. కొత్త జిల్లాల ప్రారంభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. టీఆర్‌ఎస్ నేతలు, శ్రేణులు సైతం కొత్త జిల్లాల ఏర్పాటు సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు.