
'డబ్బు ఆశతోనే నా బిడ్డను చంపిన్రు'
వరంగల్: కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఆయన భార్యకు డబ్బు పిచ్చి చాలా ఎక్కువ అని సారిక తల్లి తెలిపారు. తన కూతురు చాలా ధైర్యవంతురాలు అని, తాను బతికుండగానే ఎన్నో కష్టాలను స్వయంగా భరించిందని, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని వివరించారు. తన కూతురు జాబ్ చేసిన పైసలన్నీ రాజయ్య కుటుంబానికే ఇచ్చిందని, ఒక్క పైస కూడా తన వద్ద ఉంచుకునేది కాదని తెలిపారు. ప్రేమ వివాహం కారణంగా కట్నం లేదని వారు ఎక్కడ అసంతృప్తి వ్యక్తం చేస్తారో అని నిత్యం కష్టపడి వారికి ప్రతి రూపాయి ఇచ్చిందని పేర్కొన్నారు.
'నేనుండగానే ఎన్నో బాధలు పడ్డది నా బిడ్డ. ఆమె చాలా ధైర్యవంతురాలు. మొన్నే ఫోన్ చేసింది. మంచిగానే ఉన్నా.. ఏమైనా గొడవైతే నేనే చూసుకుంటాను. మీరు రాకండి అసలే నీ ఆరోగ్యం బాగలేదు. నాయన ఆరోగ్యం కూడా మంచిగ లేదు అని చెప్పింది. నా బిడ్డను వీళ్లే చంపిన్రు.. నా మనవళ్లను కూడా వీళ్లే హత్య చేసిర్రు. నా బిడ్డనాకే ధైర్యం చెప్పేది. నేను అన్ని సరుకులు పంపించినా. ఆమెకు ఎలాంటి అవసరాలు ఉన్నా అందించినా. నా బిడ్డకు వాళ్లు ఏనాడు సరిగా సహాయపడలేదు.. సరిగా చూసుకోలేదు. వాళ్ల అత్తమామకు(రాజయ్య ఆయన భార్య) డబ్బు ఆశ ఎక్కువ. వాళ్లే చంపేశారు' అంటూ ఆమె తీవ్రంగా రోధించింది. బుధవారం తెల్లవారుజామున మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆయన ముగ్గురు మనవళ్లు అనుమానాస్పదస్థితిలో మరణించిన సంగతి తెలిసిందే.