♦ తండ్రీకూతుళ్ల బలవన్మరణం కేసులో మలుపు
♦ తొమ్మిది మందిని ఇటలీ పంపేందుకు డబ్బులు అడిగిన ఓ వ్యక్తి
♦ డబ్బులు ముట్టజెప్పిన తర్వాత నకిలీ వీసాలు జారీ, అరెస్టులు
పట్నంబజారు (గుంటూరు) : ‘విద్యార్థులకు ఇటలీలో హోటల్ మేనేజ్‌మెంట్ సీట్లు ఇప్పిస్తా.. మొత్తం నేనే చూసుకుంటా.. నా ఖాతాలో పని నడిపించేందుకు డబ్బులు లేవు.. పంపు..’ అని చెప్పిన వ్యక్తి మాటలు నమ్మి డబ్బు అతని ఖాతాలో వేయడం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. గుంటూరులోని నవభారత్‌కాలనీలో సోమవారం తండ్రీకూతుళ్లు శిరీషా, సూర్యనారయణ బలవన్మరణానికి పాల్పడిన సంగతి విదితమే. మంగళవారం ఢిల్లీ నుంచి వచ్చిన భర్త అనేక విషయాలు వెల్లడించారు. తన భార్య ఇటలీలో హోటల్ మేనేజ్‌మెంట్ చేసిన నేపథ్యంలో మరో తొమ్మిది మందిని అక్కడికి పంపేందుకు సిద్ధమైంది. ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షల చొప్పున తీసుకుని మాయమాటలు చెప్పిన తలశిల కిషోర్ అనే వ్యక్తికి నగదు చెల్లించింది.
వీసాతో పాటు ఇతర ఏర్పాట్లు చూడటానికి ముంబైలోని గగన్‌దీప్ అనే కన్సల్టెన్సీని ఆశ్రయించారు. ఈనెల 15న హైదరాబాద్ నుంచి బయలుదేరిన పలువురు అభ్యర్థులు ఢిల్లీ నుంచి టర్కీకి, అక్కడి నుంచి ఇటలీకి వెళ్లాల్సి ఉంది. అయితే.. ఢిల్లీలోనే సదరు వ్యక్తులను నకిలీ వీసాలు కలిగి ఉన్నారని అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై 353, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తీహార్ జైలుకు పంపినట్లు సమాచారం. ఇదేకాక మరో వైపు శిరీషా కుటుంబానికి రూ. 20 లక్షలు అప్పుగా ఇచ్చి రూ. 50 లక్షలకు పైగా వడ్డీ వసూలు చేసిన ఇంటూరి శ్రీనివాసరావు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసులు కన్సల్టెన్సీతో పాటు తలశిల కిషోర్ మోసంపై విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర వివరాలు వెల్లడి కావాల్సిఉంది.
నమ్మించి.. నట్టేట ముంచి
Published Wed, Sep 20 2017 11:27 AM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM
Advertisement