మిస్టరీగా మారిన మెడికో ఆత్మహత్య | mystery of medico death in anantapur | Sakshi
Sakshi News home page

మిస్టరీగా మారిన మెడికో ఆత్మహత్య

Published Thu, Jan 14 2016 2:51 PM | Last Updated on Tue, Oct 9 2018 7:18 PM

మిస్టరీగా మారిన మెడికో ఆత్మహత్య - Sakshi

మిస్టరీగా మారిన మెడికో ఆత్మహత్య

► సినిమా కథను తలపిస్తున్న మెడికో కేసు
► అన్నీ అంతుబట్టని రహస్యాలే
 
అనంతపురం: అనంతపురం శ్రీనివాసనగర్‌లో జరిగిన మెడికో మీనాక్షి(అసలు పేరు మంజుల)ఆత్మహత్య కేసు మిస్టరీగా మారింది. ఈ కేసులో ఎన్నో చిక్కుముడులు.. అచ్చం సినిమా కథను పోలిన ఈ ఉదంతంలో లోతుగా పోయేకొద్దీ విస్తుపోయే అంశాలు వెలుగు చూస్తున్నాయి. అందరినీ ఆశ్చర్యానికి, విస్మయానికి గురి చేస్తున్నాయి.    
 
ఎవరీ మంజుల..?
బెంగళూరుకు చెందిన మీనాక్షిగా భావించిన ఆమె అసలు పేరు మంజుల అని తెలిసింది. ఆమెది బెంగళూరు కాదని, పుట్టపర్తి మండలం బత్తలపల్లికి చెందిన వడ్డే రంగమ్మ, మారెన్న దంపతుల మూడో సంతానంగా వెల్లడైంది. ఐదేళ్ల కిందట అదే గ్రామానికి చెందిన రాము చౌదరి అనే వ్యక్తి మంజులను ప్రేమించి ఇంటి నుంచి తీసుకొచ్చాడు. అప్పటి నుంచి మూడేళ్ల వరకు మంజుల ఆచూకీ కుటుంబ సభ్యులకు కూడా తెలియదు. ఆ తరువాత తాను బెంగళూరులో డాక్టర్ కోర్సు(మెడిసిన్) చదువుతున్నాని మంజుల తల్లిదండ్రులకు ఫోన్‌లో తెలిపింది. త్వరలో ఇంటికొస్తానని కూడా చెప్పినట్లు తమతో చెప్పినట్లు ఆమె తండ్రి తెలిపారు.  
 
అసలీ శ్రీనివాస్ చౌదరి ఎవరంటే?
పుట్టపర్తి మండలం రాయలవారిపల్లికి చెందిన సుబ్బమ్మ, వెంకటప్ప దంపతుల కుమారుడే శ్రీనివాస్ చౌదరి. 20 ఏళ్ల కిందట అతను బతుకుదెరువు కోసం అనంతపురానికి వచ్చాడు. మొదట ఆర్టీసీ బస్టాండ్‌లో క్యాంటిన్ నిర్వహించేవాడు. తర్వాత రైల్వేస్టేషన్‌లో క్యాంటిన్ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అతను అనేక మంది మహిళలతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. మంజులతో వెళ్లిపోయిన రాము, శ్రీనివాస్ చౌదరికి సమీప బంధువే. వారిద్దరితో పాటు మంజుల కలసి మూడేళ్లుగా అనంతపురంలోని శ్రీనివాస్‌నగర్‌లో కలసి ఉంటున్నారు. రెండేళ్ల కిందట శ్రీనివాస్ చౌదరికి మంజులతో వివాహమైంది.  అప్పటి నుంచి మంజుల ఇంట్లో ఉండగానే రోజుకో మహిళను శ్రీనివాస్ తన ఇంటికి పిలిపించుకునేవాడని చెబుతున్నారు. ఈ విషయంగా వారిద్దరి మధ్య తరచూ ఘర్షణ కూడా జరిగేందంటున్నారు.
 
రాము ఏమయ్యాడో..?
ఆరేళ్ల కిందట మంజులను పిల్చుకెళ్లిన రాము ఇప్పుడు ఏమయ్యాడో అంతుబట్టడం లేదు. శ్రీనివాస్ చౌదరితో మంజుల వివాహం ఎలా అయిందనే విషయం పెద్ద మిస్టరీగా మారింది.  
 
శ్రీనివాస్ చౌదరికి పోలీసుల అండదండలు
సోమవారం రాత్రి 10 గంటలకు మంజుల తన నాలుగు నెలల చిన్నారితో కలసి ఇంట్లో పడుకుంది. ఆ సమయంలో శ్రీనివాస్ మరో మహిళను ఇంటికి పిల్చుకువచ్చాడు. దీంతో వారిద్దరూ గొడవ పడ్డారు. ఆమె ఉరికి వేలాడింది. ఈ విషయాన్ని వెంటనే అతను మూడో పట్టణ పోలీసు స్టేషన్‌కు వెళ్లి.. రాత్రి విధి నిర్వహణలో ఉన్న ఓ ఏఎస్‌ఐకి విషయం చెప్పాడు. అతను ఈ విషయాన్ని ఓ ఎస్‌ఐకి సమాచారాన్ని అందించడంతో ఎక్కడికైనా వెళ్లి తలదాచుకోవాలని, మిగిలిన విషయాలన్నీ తాను చూసుకుంటానని అభయమిచ్చినట్లు తెలిసింది. ఎస్‌ఐ డెరైక్షన్ మేరకు మంజుల (మీనాక్షి) మృతదేహాన్ని శ్రీనివాస్ మరొసటి రోజు అర్ధరాత్రి 2 గంటలకు కారులో నేరుగా సర్వజనాస్పత్రికి తీసుకెళ్లాడు. ఈ విషయం అన్ని పత్రికల్లో రావడంతో స్పందించిన జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. దీంతో శ్రీనివాస్‌చౌదరిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే త్రీటౌన్ సీఐ ఆంజినేయులు, ఎస్‌ఐ తమీమ్ అహమ్మద్ శ్రీనివాస్‌నగర్‌లోని శ్రీనివాస్ చౌదరి ఇంట్లో సోదాలు నిర్వహించి పలు కీలక అంశాలు తెలుసుకున్నారు. శ్రీనివాస్‌చౌదరి ఇప్పటికే ముగ్గురు అమ్మాయిలను వివాహం చేసుకుని వదిలేసినట్లు తెలిసింది.
 
కేసు తారుమారుకు యత్నం
రాష్ట్రస్థాయి పోలీస్ శాఖలోని ఓ కీలక ఉన్నతాధికారికి తాను సమీప బంధువునంటూ శ్రీనివాస్ చౌదరి ప్రచారం చేసుకునేవాడు. దీంతో పోలీసులు సైతం అదే స్థాయిలో అతనికి రాచమర్యాదలు చేయడం గమనార్హం. ఇప్పటికే మంజుల మృతిని పక్కదావ పట్టించడానికి పెద్దమనుషులుగా చెలామణి అవుతున్న కొందరు దుప్పటి పంచాయితీ చేయడానికి రంగంలోకి దిగారు. నిత్య పెళ్లికొడుకుగా మారిన శ్రీనివాస్ వెనుక ఉన్న రాజకీయ నేతల అండదండలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.  
 
శ్రీనివాస్ ఎవరో మాకు తెలియదు
' అసలు ఈ శ్రీనివాస్ చౌదరి ఎవరో..? తమ బిడ్డను ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడో మాకు తెలియదు. మా కూతురు ఆరేళ్ల కిందట రాము అనే వ్యక్తితో వెళ్లిపోయింది. అతన్నే పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పింది. ఇప్పుడేమో శ్రీనివాస్ చౌదరి పెళ్లి చేసుకున్నట్లు, వారికి  నాలుగు నెలల బాబు ఉన్నట్లు అంటున్నారు. ఈ విషయం ఇంతవరకు మాకు తెలియదు. అసలు రాము ఏమయ్యాడో తెలియడం లేదు. మా బిడ్డ మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయి. నిష్పక్షపాతంగా విచారణ చేస్తే నిజాలు బయటకు వస్తాయి ' అని మంజుల తండ్రి వడ్డే మారన్న చెప్పుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement