బోధనలో మార్పు అవసరం
Published Sat, Jul 30 2016 11:56 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM
– పక్కాగా సీసీఈ మెథడ్ అమలు
– హెచ్‌ఎంల సమావేశంలో డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : కంటిన్యూవస్ కాంప్రెహెన్సివ్ ఎవాల్యేషన్(సీసీఈ) పద్ధతిని పకడ్బందీగా అమలు చేయాలని డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. సీసీఈ మెథడ్ అమలు నేపథ్యంలో విద్యార్థులు బట్టి విధానానికి స్వస్తి పలకాల్సి ఉంటుందని, ఇందుకోసం ఉపాధ్యాయుల బోధన తీరులో మార్పు రావాలన్నారు. బీక్యాంపు బాలికోన్నత పాఠశాలలో శనివారం కర్నూలు డివిజన్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సీసీఈ పద్ధతిపై అవగాహన కల్పించారు. సీసీఈ పద్ధతిలో 80 మార్కులు రాత పరీక్షకు(ఎక్సట్రనల్స్), 20 మార్కులు ప్రాజెక్టువర్కుకు(ఇంటర్నల్స్) ఉంటాయన్నారు. ఇందులో ఇంటర్నల్ మార్కులను నిబంధనల మేరకు సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయుడే ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వాటిపై డిసెంబర్, జనవరినెలల్లో ప్రత్యేక బందాలతో విచారణ జరిపిస్తామని తెలిపారు. విద్యార్థులు బట్టీ విధానం నుంచి బయట పడేలా చూడాలన్నారు. ఇందుకోసం సబ్జెక్టుపై విద్యార్థికి పూర్తిస్థాయి అవగాహన కల్గేలా బోధించాలన్నారు. అప్పుడే వారు పరీక్షల్లో మంచిమార్కులు తెచ్చుకొని ముందుకు వెళ్తారన్నారు.
మెరిట్ విద్యార్థులను దత్తత తీసుకోండి..
ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో ప్రతి పాఠశాల నుంచి ఐదుగురు విద్యార్థులు పదికి పది గ్రేడ్ తెచ్చుకునేలా చర్యలు తీసుకోవాలని, అలాంటి విద్యార్థులను దత్తత తీసుకుని చదివించాలని డీఈఓ.. హెచ్‌ఎలకు సూచించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను గాడిలో పెట్టాలన్నారు. ప్రతిరోజు ఎంతమంది విద్యార్థులు భోజనం చేశారన్న వివరాలను ఫోన్ ద్వారా సీఎం డ్యాస్ బోర్డుకు పంపాలన్నారు. పాఠశాల ఆవరణాలు, మైదానాల్లో మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. అనంతరం రిసోర్సు పర్సన్లు గోవిందరెడ్డి, తైమూరు సీసీఈ పద్ధతిపై అవగాహన కల్పించారు. డీవైఈఓలు మౌలాలి, తహెరాసుల్తానా, డీసీఈబీ కార్యదర్శి ఓంకార్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement