మార్కెట్ ‘కార్యదర్శుల’ బదిలీలు
♦ ఇతర జిల్లాలకు పోస్టింగ్‌లు
♦ పలువురికి పదోన్నతులు..
♦ కొత్త కార్యదర్శుల నియామకం
తాండూరు: జిల్లాలోని పలు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శులకు స్థానచలనం కలిగింది. రెండు రోజుల క్రితం కార్యదర్శులను ఇతర జిల్లాలకు బదిలీ చేస్తూ మార్కెటింగ్ శాఖ డెరైక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో మార్కెట్ కమిటీలకు కొత్త పాలకమండళ్లు కొలువుదీరనున్న నేపథ్యంలో కార్యదర్శులు బదిలీ కావడం గమనార్హం. బదిలీ అయిన వారి స్థానంలో కొత్త కార్యదర్శుల నియామకం కూడా వెంటనే ఉన్నతాధికారులు పూర్తి చేశారు. దీర్ఘకాలికంగా ఒకేచోట పని చేయడంతో బదిలీ చేశారు. ఇక పలు మార్కెట్లలో ఖాళీగా పోస్టులను భర్తీ చేశారు. పలువురు కార్యదర్శులకు పదోన్నతులు కల్పించారు.
తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శిగా పనిచేసిన వెంకట్‌రెడ్డిని కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు ఇటీవల బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఇబ్రహీంపట్నం గ్రేడ్-2 కార్యదర్శి ఏ.చంద్రశేఖర్‌కు ప్రత్యేక శ్రేణి కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు ఇస్తూ తాండూరుకు బదిలీ చేశారు. ఇక తాండూరులో మూడోశ్రేణి కార్యదర్శిగా పని చేస్తున్న కే.సురేందర్‌రెడ్డికి రెండో శ్రేణి కార్యదర్శిగా పదోన్నతి కల్పిస్తూ నల్గొండ జిల్లా చండూరు మార్కెట్ కమిటీకి బదిలీ చేశారు. రెండేళ్లుగా తాండూరులో ఖాళీగా ఉన్న సహాయ కార్యదర్శి పోస్టును అధికారులు భర్తీ చేశారు. నల్గొండ జిల్లా ఆలేరు మార్కెట్ కమిటీలో సూపర్‌వైజర్‌గా కొనసాగుతున్న వహిద్‌ను పదోన్నతిపై తాండూరు సహాయ కార్యదర్శిగా నియామకం చేశారు.
వికారాబాద్ మార్కెట్ కమిటీ కార్యదర్శి ఏ.శ్రీనివాస్ మూడు నెలల క్రితం మెదక్ జిల్లా సిద్దిపేటకు బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో వికారాబాద్ మార్కెట్ కమిటీ కార్యదర్శిగా నారాయణపేట్ మార్కెట్ కమిటీ నుంచి ఎం.శ్రీనివాస్‌ను నియమించారు. మర్పల్లి కార్యదర్శి వీరభద్రయ్య ఇటీవల పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో మెదక్ జిల్లా జహీరాబాద్ మార్కెట్ కమిటీ కార్యదర్శి నాగేశ్వర్‌రావును నియామకం చేశారు. మర్పల్లి ఇన్‌చార్జి కార్యదర్శిగా కొనసాగుతున్న శంకర్‌పల్లి మార్కెట్ కమిటీ కార్యదర్శి మల్లేశంను మెదక్ జిల్లా చేగుంటకు, శంకర్‌పల్లికి మెదక్ జిల్లా నర్సాపూర్ కార్యదర్శి వెంకటయ్య బదిలీ చేస్తూ మార్కెటింగ్ శాఖ డెరైక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
తాండూరు ప్రత్యేక శ్రేణి కార్యదర్శిగా నియామకం అయిన ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ కార్యదర్శి ఏ.చంద్రశేఖర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన తాండూరు మార్కెట్ కమిటీని సందర్శించారు. స్థానిక అధికారులతో సమావేశమయ్యారు. చండూరుకు బదిలీ అయిన సురేందర్‌రెడ్డి స్థానంలో మాత్రం అధికారులు ఎవరికీ పోస్టింగ్ ఇవ్వకపోవడం గమనార్హం.