ఎస్సీ మహిళా డిగ్రీ కళాశాల కోసం సిద్ధం చేస్తున్న యూత్ ట్రైనింగ్ సెంటర్
- గురుకులాలు, కళాశాలల ఏర్పాటు
- రూ.18 కోట్లతో అధునాతన భవనాల నిర్మాణం
- నిరుపేద విద్యార్థులకు వరం
మెదక్: సరస్వతీ నిలయాలు రూపుదాల్చుకుంటున్నాయి. కేజీ నుంచి పీజీ వరకు ఒకేచోట తరగతి గదులు నిర్మిస్తామని గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని ఎట్టకేలకు నిలబెట్టుకుంది. ఏడాది కాలంగా ఒక్క మెదక్ పట్టణంలోనే సుమారు రూ.18కోట్ల పైచిలుకు వెచ్చించి నూతన భవనాలను నిర్మించారు.
దీంతో పేద విద్యార్థులకు వసతి లభించింది. నిరుపేద విద్యార్థులు ఇంటర్‌తో విద్యాభ్యాసం ముగించకూడదనే ఉద్దేశంతో డిగ్రీ కళాశాలలను ఏర్పాటుచేస్తోంది. అంతేకాకుండా ఉచితంగా వసతి, భోజన సౌకర్యం సైతం కల్పిస్తున్నారు. మెదక్ పట్టణంలో రూ.6 కోట్లతో బాలికల వెలుగు పాఠశాల, కళాశాల, రూ.4కోట్లతో యూత్ ట్రైనింగ్ సెంటర్, రూ.కోటితో మినీ గురుకులం, రూ.1.50కోట్లతో ఎస్సీ కళాశాల, మైనార్టీ రెసిడెన్సియల్ స్కూల్, రూ.2కోట్లతో ఇంటిగ్రేటెడ్ వసతి గృహం నిర్మాణంలో ఉంది.
అంతేకాకుండా బాలికల డిగ్రీ కళాశాల నిర్మాణానికి రూ.2కోట్లు మంజూరు చేశారు. రూ.10లక్షలతో బాల సదనంకు నూతన భవనం నిర్మించారు. రూ.4కోట్లతో నిర్మించిన యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో ప్రస్తుతం ఎస్సీ మహిâýæ డిగ్రీ కళాశాలకోసం తాత్కాలికంగా వినియోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పక్కా భవనాల నిర్మాణానికి మరో రూ.30కోట్లు కేటాయించినట్లు ఇటీవల మెదక్‌కు వచ్చిన మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలో భాగంగా సీఎం కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ గురుకులాలను ఇప్పటికే మెదక్ పట్టణంలో ఏర్పాటు చేయించారు. ప్రైవేట్ కళాశాలలకు దీటుగా ఆంగ్ల మాధ్యమంలో బోధన నిర్మించి, విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో గురుకుల పాఠశాలలు ఏర్పాటుచేశారు. ఈ గురుకుల పాఠశాలల్లో కేవలం ఇంటర్ వరకే కాకుండా ఉన్నత విద్య అభ్యసించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.
మినీగురుకుల పాఠశాలలతోపాటు ఎస్సీ మహిళా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని భావించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 30 కళాశాలలను మంజూరుచేస్తూ గతనెల 2న ఉత్తర్వులు జారీచేసిన విషయం విదితమే. రాష్ట్రస్థాయి సంక్షేమ గురుకుల విద్యాలయాలు సొసైటీల ఆధ్వర్యంలో కొనసాగనున్నాయి.
మూడు రెసిడెన్షియల్ కళాశాలలు మంజూరు
జిల్లాలో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేటలకు ఎస్సీ మహిళా రెసిడెన్షియల్ కళాశాలలు మంజూరయ్యాయి. ఈ విద్యా సంవత్సరంలోనే వీటిని ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాత్కాలికంగా ఇతర భవనాల్లో కళాశాలలకు ఏర్పాట్లు కానిస్తున్నారు. ఒక్కో భవనం నిర్మాణంకోసం రూ.30కోట్ల చొప్పున మొత్తం రూ.90కోట్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం మెదక్‌పట్టణంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో ఎస్సీ మహిళా రెసిడెన్సియల్ కళాశాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.