♦ కిడ్నాపర్ల చెర నుంచి సురక్షితంగా
♦ బయటపడిన పవన్‌కుమార్
సాక్షి, గుంటూరు: నైజీరియాలో అపహరణకు గురైన అయిశెట్టి వెంకట పవన్‌కుమార్ ఎట్టకేలకు కిడ్నాపర్ల చెర నుంచి సురక్షితంగా బయటపడ్డారు. దీంతో రెండ్రోజులుగా భయాందోళనలో ఉన్న పవన్‌కుమార్ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. పవన్‌కుమార్ ఈనెల 20న కిడ్నాప్‌కు గురైనట్లు కుటుంబ సభ్యులకు గురువారం సమాచారం అందిన విషయం విదితమే. పవన్‌కుమార్‌తోపాటు కిడ్నాప్‌నకు గురైన ఇద్దరు వ్యక్తులను వదిలేసిన కిడ్నాపర్లు.. పవన్‌కుమార్‌ను మాత్రం శుక్రవారం అర్ధరాత్రి వరకూ వదలకపోవడంతో పవన్ భార్య లక్ష్మీఅన్నపూర్ణ, తల్లి వెంకటరత్నం తీవ్ర ఆందోళన చెందారు.
శుక్రవారం పవన్‌కుమార్ తల్లి వెంకటరత్నం పడిన ఆవేదన వర్ణనాతీతమైంది. కిడ్నాపర్లు మనసు మార్చుకుని ఎటువంటి డిమాండ్లు పెట్టకుండానే పవన్‌కుమార్‌ను శనివారం తెల్లవారుజామున సురక్షితంగా వదిలేశారు. కిడ్నాపర్ల చెర నుంచి పవన్‌కుమార్ బయటపడ్డాడన్న వార్త తెలుసుకున్న కుటుంబసభ్యుల ఆనందానికి అవధులు లేవు. మిఠాయిలు పంచుకుని ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ఆనందభాష్పాలు రాల్చారు. తన బిడ్డ కిడ్నాపర్ల చెర నుంచి బయటపడడానికి సహకరించిన వారందరికీ పవన్‌కుమార్ తల్లి వెంకటరత్నం కృతజ్ఞతలు తెలిపారు.
నైజీరియాలో కిడ్నాప్ కథ సుఖాంతం
Published Sun, Feb 28 2016 3:53 AM | Last Updated on Sun, Sep 3 2017 6:33 PM
Advertisement
Advertisement