తాగునీరు కూడా ఇవ్వలేకపోతున్నాం
విజయనగరం కంటోన్మెంట్ : జన్మభూమి సాక్షిగా నిరసనలు, బహిష్కరణలు కొనసాగుతున్నాయి. గ్రామాల్లో సమస్యలపై చివరకు టీడీపీ నాయకులు సైతం అధికారులను నిలదీస్తున్నారు.
రామభద్రపురం మండలం కోటశిర్లాంలో మంచినీటి కోసం అధికారులను ప్రజలు నిలదీశారు. గ్రామంలో నిర్వహించిన జన్మభూమి సభలో తాగునీటితోపాటు సాగునీరు రావడం లేదని బండారు నాగరాజు, మాదిరెడ్డి స్వామినాయుడు, మడక శ్రీరాములు తదితరులు అధికారులను నిలదీశారు. గ్రామంలోని రేషన్‌డిపో లేకపోవడంతో మూడు కిలోమీటర్లు నడవాల్సి వస్తోందని తెలిపారు. ఇప్పటికైనా పట్టించుకోకపోతే రాస్తారోకో చేస్తామని హెచ్చరించారు.
పాడివానివలసలో బోరు పాడయి నెలలు అవుతున్నా పట్టించుకోవడం లేదని ప్రజలు అధికారులను నిలదీశారు.
బాడంగి మండలం పెదపల్లిలో జన్మభూమి గ్రామసభను టీడీపీకి చెందిన సర్పంచ్ ఆవు అప్పలనర్సమ్మ ఇంటి వద్ద నిర్వహించడంపై విమర్శలు చోటుచేసుకున్నాయి. అదే గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడుర ఆవు సత్యనారాయణ దీనిపై ఆక్షేపించారు. దీనిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
కురుపాంలో పొడి, గొటివాడ గ్రామాల్లో అర్హులకు ఇళ్లు, పింఛన్లు ఇవ్వడం లేదని.. అనర్హులకు మాత్రం ఇస్తున్నారని ప్రజలు నిలదీశారు.
పార్వతీపురంలో జరిగిన జన్మభూమిలో సీఎస్‌డీటీ రాలేదని ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ డీలర్‌కూడా రాలేదని ఆగ్రహించారు. గ్రామసభ నుంచే జిల్లా అధికారులకు ఫోన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేశారు.
పార్వతీపురం మండలం నర్సిపురంలో మహిళా సంఘాల్లో లేనివారికి జన్మభూమిలో కుట్లు మిషన్లు పంపిణీ చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన వారికి పథకాలు అందడం లేదని నిరాశతో వెనుదిరిగారు.
సీతానగరం మండలం కాశియ్యపేటలో ఆరు రోజులుగా తాగునీరు అందలేదని ప్రత్యేకాధికారి రామచంద్రరావును ప్రజలు నిలదీశారు.
బలిజిపేట మండలం అజ్జాడలో ఐసీడీఎస్ బంగారు తల్లి పథకానికి మంజూరైన యూనిట్లకు లబ్ధిదారుల నుంచి రూ.వెయ్యి వంతున వసూలు చేశారని ప్రజలు అధికారులను నిలదీశారు.
గజపతినగరం నియోజకవర్గంలోని దత్తిరాజేరు మండలం టి.బూర్జివలసలో వైఎస్సార్‌సీపీ సర్పంచ్ మంత్రి అప్పలనాయుడు... అర్హులకు పింఛన్లు, రేషన్ కార్డులు రాలేదని, పేదలకు గృహ నిర్మాణ బిల్లులు అవ్వలేదని ప్రత్యేకాధికారి వెంకటరావును, ఎంపీపీ బెజవాడ రాజేశ్వరిలను నిలదీశారు.
దాసుపేటలో జన్మభూమి కమిటీలకే పెత్తనం కల్పించి పింఛన్లు, రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు అప్పలస్వామి విమర్శించారు.
సాలూరు మండలం జిల్లేడువలసలో జన్మభూమి సభను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయని సభలెందుకని గ్రామ సర్పంచ్ సీదరపు అప్పారావు, సీపీఎం జిల్లా నాయకుడు గేదెల సత్యనారాయణ తదితరులు ఆర్డీఓను నిలదీశారు. అన్‌సర్వే భూములు సర్వే చేయలేదని, రహదారి నిర్మాణం చేపట్టలేదని ఆగ్రహించారు. దీంతో వీటిని అమలు చేస్తామని ఆర్డీఓ హామీ ఇచ్చారు. పెదపథం ఎంపీటీసీ ఎస్.వెంకటరావు (టీడీపీ) రెండున్నరేళ్లు అయినా గ్రామానికి మంచినీరు ఇవ్వలేకపోవడం దారుణమని ప్రభుత్వ తీరుపై విమర్శించారు. తాగునీటి పథకం కూడా సక్రమంగా అమలు చేయకపోవడంతో మాట కాస్తున్నామన్నారు. సీసీ రోడ్ల నిర్మాణాలు కూడా తమకు తెలియకుండా జరుగుతున్నాయని, భూముల ఆన్‌లైన్ లేక పోవడంతో దళారులకు అమ్ముకుంటున్నామన్నారు. కొత్తవలసలో జన్మభూమి కమిటీలు, సభ్యులు డబ్బున్న వారికే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని గిరిజన సంఘ నాయకుడు జయసింహ అధికారులను నిలదీశారు. ఇలా మరిన్ని సమస్యలను చెబుతుండగా ఎంపీపీ బోను ఈశ్వరమ్మ జయసింహ వద్దనున్న మైక్‌ను లాక్కోవడంతో సభ గందరగోళంగా మారింది.