సందడి... అంతంతే
విజయవాడ (భవానీపురం) :
తొలి రోజు లెక్కకుమిక్కిలి భక్తులు వస్తారన్న కారణంగానో, లేదంటే శ్రావణ శుక్రవారం కావడం వలనో తెలియదుగానీ ఊహించినంతగా భక్తులు రాలేదు. భవానీఘాట్‌లో ఒక్కచోటే ఎక్కువ మంది స్నానాలు చేయటంతో మిగతా భాగంలో భక్తులు అక్కడక్కడా పలుచగా కనిపించారు. భవానీఘాట్ కంటేS పున్నమిఘాట్‌లో మరీ తక్కువ మంది కనిపించారు. ఇది వీఐపీ ఘాట్‌గా అధికారులు ప్రకటించడంతో భక్తులు ఇటువైపుగా పెద్దగా రాలేదు. అయితే భవానీఘాట్ నుంచి నడుచుకుంటూ వచ్చినవారిందరినీ స్నానాలు చేసేందుకు అనుమతించారు. మొత్తంమీద ఈ రెండు ఘాట్లలో భక్తులు పలుచగా ఉన్నా వందలాది మంది పారిశుద్య సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో సందడిగా కనిపించాయి. కాగా వేకువ జామునే పున్నమిఘాట్‌లో పలువురు న్యాయమూర్తులు, స్వామీజీలు స్నానాలు ఆచరించారు.
ఆకర్షించిన డ్రోన్ కెమెరా
భవానీ, పున్నమిఘాట్లలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేసినప్పటికీ డ్రోన్ కెమేరాతో కూడా నిఘా ఏర్పాటు చేశారు. నదిపై చక్కర్లు కొడుతుంటే భక్తులు ఆసక్తిగా తిలకించారు. కొంచం కిందకు దిగినప్పుడు చిన్నపిల్ల లు కేరింతలు కొడుతూ దానిని చేతితో అందుకునేందుకు ప్రయత్నించారు.