మూడు రోజులైనా నో ‘లిఫ్ట్’
మిర్యాలగూడ : నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసి మూడు రోజులు గడిచాయి. కానీ, ఎడమ కాల్వపై ఉన్న ఎత్తిపోతల పథకాలకు మాత్రం ఇప్పటి వరకు నీటిని విడుదల చేయలేదు.
మిర్యాలగూడ : నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసి మూడు రోజులు గడిచాయి. కానీ, ఎడమ కాల్వపై ఉన్న ఎత్తిపోతల పథకాలకు మాత్రం ఇప్పటి వరకు నీటిని విడుదల చేయలేదు. మరమ్మతులు పూర్తయిన ఎత్తిపోతలకు నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలో పంటలు ఎండిపోతున్నాయని అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులతో సమావేశం ఏర్పాటు చేసి ఈనెల 25న నీటిని విడుదల చేశారు. ఎడమ కాల్వ పరిధిలో మొదటి జోన్ (పాలేరు రిజర్వాయర్ వరకు)కు విడతల వారిగా నీటిని విడుదల చేశారు. మొదటి జోన్ పరిధిలోని కాల్వ ద్వారా 2,81,570 ఎకరాలు, ఎడమ కాల్వపై ఉన్న 40 ఎత్తిపోతల పథకాల కింద 81,641 ఎకరాలకు మొత్తం 3,63,211 ఎకరాలకు నీటిని విడుదల చేశారు. దీంతో పాటు ఏఎంఆర్‌పీతో పాటు ఎడమ కాల్వ పరిధిలోని 93 చెరువులను నింపడానికి ఎన్‌ఎస్‌పీ అధికారులు నీటిని విడుదల చేశారు. కాగా, మొదటి విడుతలో పది రోజుల పాటు నీటిని విడుదల చేసిన తర్వాత మరో ఐదు విడుతల్లో 15 రోజుల్లో ఎనిమిది రోజు చొప్పున నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే మొదటి విడతలో ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసి మూడు రోజులు గడిచాయి. కానీ, ఎత్తిపోతల పథకాలకు ఇప్పటి కూడా నీటిని విడుదల చేయలేదు. దీంతో లిఫ్ట్‌ల కింద ఉన్న రైతులు ఆందోళన చెంతున్నారు.