అంతులేని అభిమానం !
అంతులేని అభిమానం .. ఎల్లలదాకా ప్రయాణం
ఆత్మకూరు రూరల్: నెరిసిన జుట్టు , సడలిన ఒళ్లు, ముంచుకొచ్చిన వృద్ధాప్యం .. ఇవేవి ఆయన సంకల్ప దీక్షకు అడ్డురాలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై గల అవ్యాజాభిమానం, ఆయన కుమారుడు వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌పై ఉన్న వాత్సల్యం.. అరవై ఏళ్ల రహిమాన్‌ను తన ద్విచక్రవాహనంపై రాష్ట్రం నలుమూలకు ప్రచార యాత్ర సాగించేందుకు పూనుకునేందుకు పురికొల్పాయి. రహిమాన్ శుక్రవారం ఆత్మకూరు వచ్చారు. పులివెందుల మండలం వేంపల్లెకు చెందిన విశ్రాంత సైనిక, దూరదర్శన్ ఉద్యోగి అయిన ఈయన.. మూడు నెలల కిందట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన ప్రచార యాత్ర చేపట్టారు. తన బజాజ్ ద్విచక్రవాహనానికి చుట్టూ దివంగత వైఎస్‌ఆర్ çఅమలు చేసిన పథకాల జాబితాను, వైఎస్ జగన్ చేపట్టిన దీక్షల వివరాలను, వైఎస్ ఆర్, వైఎస్ జగన్, వైఎస్ షర్మిళ చిత్రపటాలను , పార్టీ పతాకాలను అలంకరించాడు. వాహనానికి ఉన్న చిన్న పాటి మైక్ సిస్టంలో వైఎస్‌ఆర్ పాటలు వినిపిస్తూ తన యాత్ర సాగిస్తున్నాడు. నిజానికి తనకు శ్రీశైలం నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటన ఉన్నట్లు తెలియదని ఇక్కడికి వచ్చాకే విషయం తెలిసిందన్నారు. తాను జగనన్నతో పాటు నియోజకవర్గం అంతటా అనుసరిస్తానని ఆయన చెప్పారు.