నో మనీ.. నో వర్‌‌క | No Money No work | Sakshi
Sakshi News home page

నో మనీ.. నో వర్‌‌క

Published Tue, Nov 22 2016 1:34 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM

No Money No work

 పలుగు పార చేతబట్టి..పూటంతా స్వేదం చిందిస్తూ పొట్టపొసుకునే దినసరి కూలీలకు ‘పెద్ద’ కష్టం వచ్చింది. చేసుకునేందుకు పనులు లేక.. చేతుల్లో చిల్లిగవ్వ లేక పస్తులుండే దుస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం రూ.500, 1,000 నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న మరుసటి రోజు నుంచి జిల్లాలో భవన నిర్మాణాలు నిలిచిపోవడమే ఇందుకు కారణం. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలదీ.. ఇంచుమించూ ఇదే స్థితి. అక్టోబర్ నెలాఖరు వరకు కూలీలకు చెల్లించాల్సిన వేతన బకాయిల్లో కొంత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఒకటిన విడుదల చేసింది. బ్యాంకుల నుంచి పోస్టాఫీసుల ఖాతాలకు నగదు చేరింది. ఈ క్రమంలో పెద్ద నోట్లు రద్దు కావడంతో కూలీలకు అందాల్సిన నగదు పోస్టాఫీసుల ఖాతాల్లోనే ఇరుక్కుపోయింది. మూడు జిల్లాల్లో కలిపి సుమారు రూ.9.24 కోట్లు తపాలా కార్యాలయాల్లోనే మూలుగుతున్నాయి. బకా యిలు రాక.. చిల్లర దొరక్క.. పనుల్లేక ‘ఉపాధి’ కూలీలు విలవిల్లాడు తున్నారు.
 
 నల్లగొండ : గ్రామ పోలిమేరల్లో రోజూ వినిపించే పలుగు, పార సప్పుడు బంద్ అయింది. కేంద్ర సర్కార్ రూ.500, 1000 నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయ ప్రభావం ఉపాధి హామీ కూలీలపైనా పడింది.  నోట్ల మార్పిడి, నగదు చెల్లిం పుల వ్యవహారం పోస్టాఫీసులకు అప్పగించడం.. అక్కడ సిబ్బంది కొరత కూడా తోడవ్వడంతో ఉపాధి కూలీలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. చేసిన పనికి డబ్బులు అందక...చేతిలో చిల్లిగవ్వ లేక కూలీలు దిక్కుతోచని స్థితిలో అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఇంకో విషయం ఏమిటంటే పే ఆర్డర్లు జనరేట్ చేసినప్పటికీ కూలీలకు డబ్బులు చెల్లించడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. సోమవారం కలెక్టర్ల ఆధ్వర్యంలో జరిగే గ్రీవెన్స్ సెల్‌కు వచ్చి కూలీలు మొరపెట్టుకున్నారు.  
 
 నిధుల మెలిక...
 పోస్టాఫీసుల్లో నగదు నిల్వలను ఖాళీ చేస్తే గానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన మిగులు బకాయిలు వచ్చే పరిస్థితి లేదు. ఇటీవల జిల్లా అధికారులతో జరిగిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఉన్నతాధికారులు అదే విషయాన్ని తేల్చిచెప్పారు. పోస్టాఫీసుల్లో నిల్వ ఉన్న నిధులను కూలీలకు చెల్లించిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం బకాయిపడిన రూ.17.13 కోట్లు కేంద్రం నుంచి కోరేందుకు వీలుంటుందని ఉన్నతాధికారులు చెప్పినట్లు తెలిసింది. దీంతో కూలీలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వ్యవసాయ పనులకు వెళ్దామన్న అక్కడ కూడా చేదు సంఘటనలే ఎదురవుతుండటంతో కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. 
 
 నిలిచిన పనులు
 మూడు జిల్లాల్లోని గ్రామాల్లో ఉపాధి పనులు ఎక్కడా జరగడం లేదు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను సంరక్షించే పనులు తప్పా మిగతా పనులు నిలిచిపోయాయి. నల్లగొండ జిల్లాలో ఈ నెల మొదటి వారంలో ప్రతి రోజు పదకొండు వందల కూలీలు మాత్రమే పనికి వచ్చారు. యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో సిబ్బంది కొరత కారణంగా దినసరి కూలీల హాజరు నమోదు చేయలేకపోతున్నారు. దీంతో ఈ రెండు జిల్లాల్లో దినసరి కూలీల రిపోర్ట్ నిల్‌గానే కనిపిస్తోంది. నల్లగొండ జిల్లాలో 42,645 రకాల పనులు, యాదాద్రిలో 18,430, సూర్యాపేటలో 27 వేల రకాల పను లు సిద్ధం చేసి అందుబాటులో ఉంచారు. కానీ నల్లగొండ జిల్లాలో 502 గ్రామాలకు గాను 215 పంచాయతీల్లోనే పను లు జరుగుతున్నాయి. యాదాద్రిలో 331, సూర్యాపేటలో 325 పంచాయతీల్లో పనులు జరగడం లేదని తెలుస్తోంది. 
 
 బకాయిలు చెల్లిస్తేనే..
 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను లేబర్ బడ్జెట్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వచ్చే మార్చినాటికి నల్లగొండ జిల్లా ఉపాధి కూలీలకు 96 లక్షల పనిదినాలు కల్పించాల్సి ఉంది. దీనికి గాను ఇప్పటి వరకు 63 లక్షల పనిదినాలు కల్పించారు. 1,84,588 కుటుంబాలకు ఉపా ధి కల్పించగా...దాంట్లో వంద రోజుల పాటు లబ్ధిపొందిన కుటుంబాలు కేవలం 6,718 మాత్రమే.  
 
 సూర్యాపేట జిల్లాలో 60 లక్షల పనిదినాలకు గాను 43 లక్షల పనిదినాలు కల్పించారు. ఈ జిల్లాలో 1,44,979 కుటుంబాలకు ఉపాధి కల్పించగా దాంట్లో వంద రోజుల పాటు పనిచేసిన కుటుంబాలు కేవలం 2,353 మాత్రమే. 
 యాదాద్రి జిల్లాలో 28 లక్షల పనిదినాలకుగాను 19 లక్ష లు పనిదినాలు కల్పించారు. హైదరాబాద్‌కు సమీపంలో ఉండటంతో ఈ జిల్లాలో ఉపాధి పనులకు డిమాండ్ తక్కువగానే ఉంటుంది. ఈ జిల్లాలో ఉపాధి పొందిన కుటుంబాలు 71,287...దీంట్లో 100 రోజుల పాటు లబ్ధి పొందిన కుటుంబాలు 1016 మాత్రమే. కూలీల వేతన బకాయిలు చెల్లిస్తే తప్పా వచ్చే మార్చి నాటికి నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేమని అధికారులంటున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement