వర్గోన్నతితో సరి.. వైద్యం హరీ | no proper services in phc | Sakshi
Sakshi News home page

వర్గోన్నతితో సరి.. వైద్యం హరీ

Published Sun, Feb 26 2017 11:17 PM | Last Updated on Thu, Sep 19 2019 8:59 PM

వర్గోన్నతితో సరి.. వైద్యం హరీ - Sakshi

వర్గోన్నతితో సరి.. వైద్యం హరీ

9 పీహెచ్‌సీలను సీహెచ్‌సీలుగా ప్రకటించి ఆరేళ్లు
 మరుగునపడిన నరసాపురం, పాలకొల్లు, భీమవరం, కొవ్వూరు ఆస్పత్రుల ఆప్‌గ్రేడేషన్‌ 
 వర్గోన్నతి ఆస్పత్రుల్లో భర్తీకాని పోస్టులు
 సదుపాయాల సంగతి సరేసరి
 
కొవ్వూరు : పేదోళ్లకు వైద్య సేవలు అందించే విషయంలో సర్కారు నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రుల వర్గోన్నతి (ఆప్‌గ్రెడేషన్‌)ప్రకియను కాగితాలకే పరిమితం చేసింది. మౌలిక సదుపాయాల కల్పన, వైద్యులు, సిబ్బంది కొరత తీర్చడంపై దృష్టి సారించడం లేదు. ఫలితంగా పేదలు అరకొర వైద్యసేవలతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. జిల్లాలో నిడదవోలు, గోపాలపురం, ఆచంట, పెనుగొండ, ఆకివీడు, భీమడోలు, బుట్టాయగూడెం, దెందులూరు, పోలవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సామాజిక ఆరోగ్య కేంద్రాలు (30 పడకల ఆస్పత్రులు)గా ఆప్‌గ్రేడ్‌ చేసి ఆరేళ్లు పూర్తి కావస్తోంది. డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ పరిధిలో ఉన్న 9 ఆస్పత్రులను కమిషనర్‌ ఆఫ్‌ వైద్య విధాన షరిషత్‌లో విలీనం చేశారు. వర్గోన్నతి ప్రకారం ఈ ఆస్పత్రులకు అవసరమైన వైద్యులు, సిబ్బంది నియామకం, వైద్య పరికరాలు సమకూర్చటంపై ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. కొయ్యలగూడెంలో ఆప్‌గ్రేడ్‌డె పీహెచ్‌సీని 50 పడకల ఆస్పత్రిగా మార్చాలని ఎప్పటినుంచో ప్రతిపాదన ఉంది. మంత్రి పీతల సుజాత ప్రాతినిధ్యం వహిస్తున్న చింతలపూడిలో ప్రస్తుతం ఉన్న 30 పడకల ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేయాలన్న ప్రతిపాదన కార్యరూపం దాల్చడం లేదు.
 
 సీహెచ్‌సీల్లో 10 డాక్టర్‌ పోస్టులు ఖాళీ
జిల్లాలోని మొత్తం 14 సీహెచ్‌సీల్లో 10 డాక్టర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని కాంట్రాక్ట్‌ వైద్యులతో నెట్టుకొస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యుల నియామకానికి నోటిఫికేషన్‌ జారీ చేసినా భర్తీ ప్రక్రియ పూర్తి కావడానికి మరింత సమయం పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
 
వెక్కిరిస్తున్న బోర్డులు
పేదలకు వైద్య సేవలను మరింత అందుబాటులోకి తేవాలని భావించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జిల్లాలోని నరసాపురం, పాలకొల్లు, భీమవరం, కొవ్వూరు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్ల(సీహెచ్‌సీ)ను ఏరియా ఆస్పత్రులుగా అప్‌గ్రేడ్‌ చేయాలని నిర్ణయించారు. ఆయన మరణానంతరం 2010 నవంబర్‌ 19న ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. వీటికి భవనాలు ఏర్పాటు చేశారు. కొన్నాళ్లు రికార్డుల్లో ఈ నాలుగు ఏరియా ఆస్పత్రులుగానే నడిచాయి. అవసరమైన వైద్యులు, సిబ్బంది, మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాలు సమకూర్చకపోవడంతో వీటిని తిరిగి సీహెచ్‌సీ జాబితాలోకి నెట్టేశారు. ఏరియా ఆస్పత్రులుగా పేర్కొంటూ ఈ నాలుగు ఆస్పత్రులకు ఏర్పాటు చేసిన బోర్డులు ప్రభుత్వ వైఫల్యాన్ని చాటుతున్నాయి. ఈ నాలుగు ఆస్పత్రుల్లోను ఆ స్థాయికి తగినంతమంది వైద్యులు, సిబ్బంది లేరు.
 
వైద్య సేవలు పూజ్యం
జిల్లాలో ఆరేళ్ల క్రితం ఏర్పడిన తొమ్మిది సీహెచ్‌సీల్లో మెడికో లీగల్‌ కేసుల (ఎంఎల్‌సీ)కు వైద్యం అందించే పరిస్థితి లేదు. దీంతో రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలు, ఇతర ప్రమాదాల బారినపడిన వారికి అవస్థలు తప్పడం లేదు. క్షతగాత్రులను ప్రభుత్వ, ప్రవేటు ఆస్పత్రులకు తరలించేలోపు కొందరి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మృతదేహాలకు నిడదవోలు, పోలవరంలో మినహా మిగిలిన ఏడు సీహెచ్‌సీల్లో పోస్టుమార్టం చేయటం లేదు. పోస్టుమార్టంకు అవసరమైన షెడ్లు, ఇతర ఏర్పాట్లు, సిబ్బంది, సరిపడినంత మంది వైద్యులు లేకపోవటమే దీనికి కారణం. దీంతో గోపాలపురం మండలం నుంచి సుమారు 40 కిలోమీటర్లు దూరంలోని కొవ్వూరు ఆస్పత్రికి, బుట్టాయగూడెం మండలం నుంచి జంగారెడ్డిగూడేనికి, దెందులూరు, భీమడోలు మండలాల నుంచి ఏలూరుకు, ఆచంట, పెనుగొండ మండలాల నుంచి పాలకొల్లు, ఆకివీడు మండలం నుంచి భీమవరం ఆస్పత్రులకు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించాల్సి వస్తోంది. అప్‌గ్రేడ్‌ చేసిన ఆస్పత్రుల్లో సదుపాయాల కల్పనతోపాటు వైద్యుల పోస్టులు భర్తీ చేస్తే ఈ సమస్యలకు తెరపడే అవకాశం ఉంటుంది.
 
ఎన్టీఆర్‌ వైద్య సేవకు దూరం
ఎన్టీఆర్‌ వైద్య సేవ ద్వారా అందించే 133 వైద్య సేవలు జిల్లాలో కేవలం మూడు ఏరియా ఆస్పత్రులు, జిల్లా కేంద్ర ఆస్పత్రిలోనే అందిస్తున్నారు. కొన్ని సీహెచ్‌సీల్లో ఈ సేవలు అందిస్తున్నామని అధికారులు చెబుతున్నా అవి నామమాత్రమే. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ వైద్య సేవలు అందుబాటులో లేక రోగులు అవస్థ పడుతున్నారు. నాలుగు సీహెచ్‌సీలను ఏరియా ఆస్పత్రులుగా అప్‌గ్రేడ్‌ చేయడం ద్వారా ఒక్కో ఆస్పత్రికి నలుగురు సివిల్‌ సర్జన్లు, 10 మంది అసిస్టెంట్‌ సివిల్‌ సర్జన్లతోపాటు 24 మంది స్టాఫ్‌ నర్సులు, నలుగురు హెడ్‌ నర్సుల పోస్టులు సమకూరతాయి. తద్వారా ఎన్టీఆర్‌ వైద్య సేవలతో పాటు, ఉద్యోగులకు ప్రభుత్వపరంగా అందించే వైద్య సేవలు, ఆపరేషన్లు అందుబాటులోకి వస్తాయి.
 
ప్రతిపాదనలు పంపాం
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ అయింది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరో రెండు నెలలు పడుతుంది. గత ఏడాది వైద్య విధాన పరిషత్‌లో కలిసిన తొమ్మిది సీహెచ్‌సీల్లో ఏడు చోట్ల పోస్టుమార్టం షెడ్లు లేవు. ఈ ఆస్పత్రుల్లో 100 మంది పారిశుధ్య కార్మికులు, 50 మంది సెక్యూరిటీ గార్డులు, 9 మంది సూపర్‌వైజర్లను నియమిస్తున్నాం. త్వరలో పూర్తిస్థాయిలో వైద్య పరికరాలు అందుబాటులోకి వస్తాయి. కొవ్వూరు, భీమవరం, నరసాపురం, పాలకొల్లు ఆస్పత్రులను ఏరియా ఆస్పత్రులుగా, చింతలపూడి ఆస్పత్రిని 100 పడకలు, కొయ్యలగూడెం ఆస్పత్రిని 50 పడకల ఆస్పత్రులుగా మార్చాలని ప్రతిపాదనలు పంపింంచాం. వైద్యుల పోస్టులు భర్తీ చేస్తే ఎన్టీఆర్‌ వైద్య సేవలు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోను అందుబాటులోకి వస్తాయి.
 డాక్టర్‌ కె.శంకరరావు, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల సమన్వయకర్త
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement